పాలమూరు ఆశలపై కేంద్రం నీళ్లు

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ప్రతినిధి : తెలంగాణలో అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చే ప్రతిపాదన ప్రస్తుతం లేదని కేంద్రం రాజ్యసభలో స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ ఎంపీ రేణుకా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ ప్రకటనతో ఇప్పటికే భారీ అంచనాలు, జాప్యాలు, అంతర్రాష్ట్ర జల వివాదాలతో ముందుకు సాగుతున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై మరోసారి చర్చ మొదలైంది.

కృష్ణా జలాల వినియోగంపై ఈ ప్రాజెక్టు ఆధారపడి ఉందని కేంద్రం పేర్కొంది. కృష్ణా జలాల వినియోగం, అంతర్రాష్ట్ర అంశాలు కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌–II పరిధిలో ఉన్నాయని తెలిపింది. ఈ అంశానికి సంబంధించి న్యాయపరమైన విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి సాంకేతిక, ఆర్థిక మదింపు చేపట్టడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయహోదా ఇవ్వాలంటే సాంకేతిక, ఆర్థిక మదింపు తప్పనిసరి కావడంతో ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) వెనక్కి పంపినట్లు వెల్లడించింది.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణలో కరువు ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన భారీ ప్రాజెక్టు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల ప్రజలు ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ, న్యాయపరమైన వివాదాలు, పనుల జాప్యం తదితర అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా నిర్ణీత గడువుల్లో పనులు పూర్తికాకపోవడంతో వ్యయం కూడా భారీగా పెరిగింది.

మరోవైపు ప్రాజెక్టు పనులపై తెలంగాణ ప్రభుత్వం కూడా కఠిన వైఖరి అవలంబిస్తోంది. కాంట్రాక్టు ఒప్పందాలు, టెండర్‌ ప్రక్రియ, పనుల్లో జాప్యం, పెరుగుతున్న నిర్మాణ వ్యయం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మూడు దశాబ్దాల క్రితం జారీ చేసిన జీవో–94లో అవసరమైన మార్పులు చేసేందుకు ఈ కమిటీని నియమించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత పెంచడంతో పాటు నిబంధనలను కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టింది.

ఇదిలా ఉండగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని 7, 11, 15, 17వ ప్యాకేజీల సవరించిన అంచనాలకు జూలై 17న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ.2,353.38 కోట్ల భారం పడనుంది. 2016లో ఈ నాలుగు ప్యాకేజీల పనులకు ఒప్పందాలు కుదిరినా భూసేకరణలో జాప్యం, న్యాయస్థానాల్లో కేసులు, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా పనులు ముందుకు సాగలేదు. దాదాపు పదేళ్లు గడిచినా పనులు పూర్తికాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఒప్పంద కాలంలో పనులు పూర్తికాకపోవడంతో పెరిగిన ధరల ప్రభావం, అదనపు పనుల అవసరం, జీఎస్టీతో పాటు ఇతర పన్నుల భారం ప్రాజెక్టు అంచనాలను గణనీయంగా పెంచాయి. ఒకవైపు జాతీయహోదాపై కేంద్రం నుంచి ప్రతికూల ప్రకటన రావడం, మరోవైపు ప్రాజెక్టు వ్యయం అంతకంతకూ పెరుగుతుండటం తెలంగాణకు కీలక సవాలుగా మారింది. కృష్ణా జలాల అంశంపై న్యాయపరమైన చిక్కులు తొలగి, ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు వేగంగా లభించి, నిర్మాణ పనులు నిర్ణీత కాలంలో పూర్తయితేనే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఆశించిన ప్రయోజనాలను అందించే అవకాశం ఉంది.

You may also like...