పోలీసు వ్యవస్థ ఎవరి పక్షం?
- పోలీసు వ్యవస్థ ఎవరి పక్షం? - November 19, 2026
- చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు! - November 18, 2026
- సీఎస్‌ను కలిసిన ఆర్టీసీ ఎండీ, హైదరాబాద్ సీపీ - November 18, 2026

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్:
న్యాయం కోసం పోలీసు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితురాలికి భరోసా ఇచ్చేదెవరు? నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, బాధితురాలు మాత్రం రక్షణ కోసం గడపగడపా తిరగాల్సిన దుస్థితి ఎందుకు? పోలీసు వ్యవస్థ నేరస్తుల పక్షాన నిలుస్తుందా? బాధితుల పక్షాన నిలుస్తుందా? అంటూ బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ పోలీసు యంత్రాంగాన్ని తీవ్రంగా నిలదీశారు. ఆల్వాల్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 989/2026 కేసుపై ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టు సంచలన చర్చకు దారితీసింది.
ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యావంతురాలిపై పథకం ప్రకారం లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదై 50 రోజులు దాటినా ప్రధాన నిందితుడు పరారీలోనే ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నిందితులు న్యాయవాదుల ముసుగులో నల్లకోట్లు, మాస్కులు ధరించి కోర్టు విచారణలను పరిశీలిస్తున్నారని, పోలీసులు చూస్తూ మౌనంగా ఉంటున్నారని ఆరోపించారు.
మరోవైపు నిందితుల ముఠా బాధితురాలిని నిరంతరం వెంబడిస్తూ వేధిస్తోందని, తాజాగా అబిడ్స్ పోలీస్స్టేషన్లోనూ మరో కేసు నమోదైనట్లు వెల్లడించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి ఐపీఎస్‌ను కలసి తన గోడు చెప్పుకోవాలని ప్రయత్నించిన బాధితురాలికి పలుమార్లు అనుమతి నిరాకరించారని ప్రశ్నించారు.
ధనవంతులకు ఒక న్యాయం.. దళితులకు మరో న్యాయమా?
పోలీసులకు వేర్వేరు న్యాయసూత్రాలు ఏమైనా ఉన్నాయా? ఇది వివక్ష కాదా? అంటూ డీజీపీ, సీనియర్ పోలీసు అధికారులతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు. బాధితురాలికి తక్షణ భద్రత కల్పించి, నిందితులను చట్టప్రకారం అరెస్టు చేయాలని, కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం వచ్చిన బాధితురాలికి నిరీక్షణే మిగిలితే ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయంపై నమ్మకం ఎలా నిలుస్తుందన్న ప్రశ్నను ఆయన తన పోస్టు ద్వారా బలంగా లేవనెత్తారు.
