ఖరీదైన మద్యం సీసాల్లో చీప్ లిక్కర్ శంషాబాద్‌లో కల్తీ మద్యం ముఠా గుట్టురట్టు

416952.jpg

శంషాబాద్ : వాడి పడేసిన ఖరీదైన విదేశీ మద్యం సీసాల్లో చౌకబారు మద్యాన్ని నింపి, ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న ముఠాను గ్రేటర్ హైదరాబాద్ ఎక్సైజ్ (DTF) టాస్క్ ఫోర్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడైన మాజీ డిస్టిలరీ కార్మికుడు వంగలి అశోక్ (43) తో పాటు, పాత సామాన్ల వ్యాపారి మహమ్మద్ యాకూబ్ పాషా (29) ను అదుపులోకి తీసుకున్నారు.

పక్కా సమాచారంతో శంషాబాద్‌లోని సాతంరాయి ప్రాంతంలో ఉన్న అశోక్ నివాసంపై సిఐ నరేందర్ నేతృత్వంలోని డీటీఎఫ్ బృందం దాడులు నిర్వహించింది. నిందితుడు యాకూబ్ పాషా వద్ద నుంచి ఖాళీ అయిన జానీ వాకర్ (Johnnie Walker), డీవార్స్ (Dewar's), 100 పైపర్స్ (100 Pipers) వంటి ఖరీదైన బ్రాండ్ల సీసాలను సేకరించేవాడు. వాటిని శుభ్రం చేసి, రూ. 560 విలువైన 'డౌన్ టౌన్' (Down Town) మద్యాన్ని వాటిలో నింపి, ఒరిజినల్ బ్రాండ్లుగా నమ్మించి స్థానికంగా సుమారు 10 మంది వినియోగదారులకు అధిక ధరలకు విక్రయించేవాడు.

దాడుల్లో భాగంగా 10 నింపిన మద్యం సీసాలతో పాటు 30కి పైగా ఖాళీ బ్రాండెడ్ సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద మద్యం కొనుగోలు చేసిన వారి పాత్రపై కూడా ఎక్సైజ్ శాఖ విచారణ జరుపుతోంది. ఈ ముఠాను పట్టుకున్న సిఐ నరేందర్ బృందాన్ని గ్రేటర్ హైదరాబాద్ ఎక్సైజ్ ఉన్నతాధికారులు అభినందించారు.

You may also like...