అర్ధరాత్రి బైక్‌లకు భగ్గుమన్న మంటలు

రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌షాకోట్ డివిజన్ సాయిరాంనగర్ కాలనీలో అర్ధరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది. ఇంటి ప్రాంగణంలో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో క్షణాల్లోనే పరిస్థితి భయానకంగా మారింది. పెట్రోల్ ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఐదు బైక్‌లను పూర్తిగా దహనం చేశాయి. అగ్నికీలల తీవ్రతకు దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా సంభవించిన ఈ ఘటనతో ఏం జరుగుతుందో అర్థంకాక కాలనీ వాసులు ఉలిక్కిపడ్డారు.

అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఐదు వాహనాలు కళ్లముందే మంటల్లో కాలిపోవడంతో బాధితులకు భారీ ఆస్తినష్టం వాటిల్లింది. ఘటన వెనుక కారణాలపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బైక్‌లకు నిప్పంటించారా? అన్న ప్రశ్నలు తీవ్ర చర్చకు దారితీశాయి.

ఈ ఘటనపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడ సంచరించినట్లు సీసీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో అనుమానాస్పద వ్యక్తి కదలికలకు అగ్నిప్రమాదానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. సీసీ ఫుటేజ్‌, ఘటనాస్థల పరిస్థితులు, అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను పరిశీలిస్తూ అసలు కారణాన్ని వెలికితీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రమాదమా, ఉద్దేశపూర్వక చర్యనా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

You may also like...