గురుకుల అడ్మిషన్ల పేరుతో వసూళ్లు?

  • అడ్మిషన్లు ఇప్పిస్తానంటూ తల్లిదండ్రులకు వల
  • 25 మందికి పైగా ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల వసూళ్లు?
  • డబ్బులు తీసుకుని పది రోజులుగా ఫోన్ స్విచ్ఛాఫ్
  • అడ్మిషన్ల కోసం టీ.సీలు తీసుకుని తల్లిదండ్రుల ఎదురుచూపులు
  • వసూళ్ల ఆరోపణలపై సమగ్ర విచారణకు డిమాండ్

జ్ఞానతెలంగాణ, ప్రతినిధి : గురుకులాలు, మహాత్మా జ్యోతిబా ఫూలే (ఎంజేపీ) పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పిస్తానంటూ తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఓ రాజకీయ నాయకుడిపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 25 మంది తల్లిదండ్రుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.25 వేల చొప్పున నగదు తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే డబ్బులు తీసుకున్న అనంతరం అడ్మిషన్లు ఇప్పించకపోవడమే కాకుండా, గత పది రోజులుగా ఫోన్‌ కాల్స్‌కు స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని వారు వాపోతున్నారు.

తమ పిల్లలకు గురుకులాలు, ఎంజేపీ పాఠశాలల్లో సీట్లు ఇప్పిస్తానని నమ్మబలికి సంబంధిత వ్యక్తి డబ్బులు తీసుకున్నట్లు బాధిత తల్లిదండ్రులు చెబుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుపై ఆశతో అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుందని నమ్మి కొందరు తమ పిల్లల పాత పాఠశాలల నుంచి టీ.సీలు కూడా తీసుకున్నారని తెలుస్తోంది.

అయితే రోజులు గడుస్తున్నా అడ్మిషన్లు జరగకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలో తెలియక తీవ్ర అయోమయానికి గురవుతున్నామని బాధితులు చెబుతున్నారు. అడ్మిషన్ ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్న వ్యక్తి తమ ఫోన్లకు స్పందించకపోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల చొప్పున సుమారు 25 మందికి పైగా డబ్బులు తీసుకున్నట్లయితే మొత్తం వ్యవహారం లక్షల రూపాయలకు చేరే అవకాశం ఉంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అడ్మిషన్ల పేరుతో డబ్బులు వసూలు చేశారా? నిజంగా పాఠశాలల్లో సీట్లు ఇప్పించే ప్రయత్నం చేశారా? లేక తల్లిదండ్రులను మభ్యపెట్టి నగదు తీసుకున్నారా? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు అవసరం.

గురుకులాలు, ఎంజేపీ పాఠశాలల్లో ప్రవేశాలు సాధారణంగా నిర్దిష్ట నిబంధనలు, మెరిట్‌, ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్ లేదా అధికారిక ప్రక్రియ ఆధారంగా జరుగుతాయి. ఇలాంటి ప్రవేశాలను డబ్బులు తీసుకుని ఇప్పిస్తామంటూ ఎవరైనా హామీ ఇస్తే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించాల్సిన అవసరం ఉంది.

తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని, పిల్లల అడ్మిషన్ల విషయంలో స్పష్టత ఇవ్వాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత వ్యక్తి అందుబాటులోకి వచ్చి తమకు సమాధానం చెప్పాలని కోరుతున్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఇలాంటి వ్యవహారాలు జరిగి ఉంటే, వాస్తవాలను నిష్పక్షపాతంగా వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

గురుకుల విద్యపై పేద కుటుంబాలు పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఎవరైనా అక్రమంగా డబ్బులు వసూలు చేసి ఉంటే అది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ప్రయత్నాలను అడ్డుకోవాలని, తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన మొత్తంపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని వారు కోరుతున్నారు.

You may also like...