ఎన్నికల సంఘం జవాబుదారీతనం ఎక్కడ?

ఎన్నికల సంఘం జవాబుదారీతనం ఎక్కడ?
ఓటు హక్కును కాపాడాల్సిన సంస్థే ప్రశ్నార్థకంగా మారడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.
గోవాలో 97 మంది ఓటర్ల వ్యవహారంపై సమాధానం చెప్పాలి
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 27 : ఓటు హక్కును కాపాడాల్సిన ఎన్నికల సంఘం పనితీరుపైనే ప్రశ్నలు తలెత్తడం ప్రజాస్వామ్యానికి ఆందోళనకరమని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. ఆదివారం నకిరేకల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల జాబితా తయారీ, నిర్వహణకు సంబంధించిన సాంకేతిక వ్యవస్థే అధికారుల నిర్ణయాలను అమలు చేయలేని పరిస్థితి ఉంటే అందుకు బాధ్యత ఎవరిదో ఎన్నికల సంఘం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గోవాలో 97 మంది ఓటర్ల వ్యవహారం దీనికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది కేవలం 97 మంది ఓటర్ల సమస్య కాదని, అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు. ఎన్నికల సంఘంలోని కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు నిర్ణయాలపై 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికలపై కూడా ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటర్ల పేర్ల తొలగింపు, ఫామ్‌-6 మార్పులు, ఓటర్ల డేటాబేస్‌కు సంబంధించిన అంశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలిపారు. ఓటు హక్కు విషయంలో చోటుచేసుకునే తప్పిదాలు, జాప్యాలకు బాధ్యత ఎవరు వహిస్తారో ప్రజలకు చెప్పాలని దైద రవీందర్ డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతోపాటు గోవాలో 97 మంది ఓటర్ల వ్యవహారంపై పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని కోరారు.
ఎన్నికల జాబితా నిర్వహణలో సాంకేతిక సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని, ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని దైద రవీందర్ తెలిపారు. ఓటు హక్కు కేవలం ఒక ఓటు కాదని, అది రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు. ఓటు హక్కుపై ఎలాంటి సందేహాలు, ఆరోపణలు వచ్చినా ఎన్నికల సంఘం ప్రజలకు పారదర్శకంగా సమాధానం చెప్పాలని కోరారు. సమావేశంలో రాజశేఖర్ గౌడ్, మహేష్, నాగార్జున, శివ, రవి, మధు, ప్రమోద్ తదితరులు ఉన్నారు.

You may also like...