గైర్హాజరీ టీచర్లపై ఇకపై కఠిన చర్యలు!

  • ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే క్రమశిక్షణ చర్యలు
  • ఒక్కరోజు గైర్హాజరీపైనా విచారణకు అవకాశం
  • దీర్ఘకాలిక అనధికారిక గైర్హాజరీపై ఉద్యోగమే కోల్పోయే ప్రమాదం
  • ‘డైస్ నాన్’తో ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ ప్రయోజనాలపై ప్రభావం
  • పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించే అధికారులకూ బాధ్యత

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఆగస్టు 13: ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిపై ఇకపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ Rc.No.Spl/Ser.IV/2026, తేదీ 11-08-2026తో మార్గదర్శకాలు జారీ చేసినట్లు పేర్కొంది. దీర్ఘకాలంగా విధులకు దూరంగా ఉన్న ఉద్యోగులపై క్షేత్రస్థాయి అధికారులు చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యాబోధన, పాఠశాల పాలన దెబ్బతింటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తెలంగాణ ఫండమెంటల్ రూల్స్, లీవ్ రూల్స్, సీసీఏ రూల్స్–1991 ప్రకారం అనధికారిక గైర్హాజరీని ఇకపై తీవ్రంగా పరిగణించనున్నారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన కాలాన్ని ‘డైస్ నాన్’గా పరిగణించే అవకాశం ఉండటంతో ఉద్యోగి వార్షిక ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ వంటి ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం పడనుంది.
వరుసగా ఒక సంవత్సరం అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే సీసీఏ నిబంధనల ప్రకారం విచారణ చేపట్టి కఠిన చర్యలు, అవసరమైతే ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. అలాగే ఏడాదికి పైగా అనుమతి లేకుండా గైర్హాజరు కావడం లేదా సెలవుతో/సెలవు లేకుండా వరుసగా ఐదేళ్లు విధులకు దూరంగా ఉండే పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం రాజీనామాగా పరిగణించే అంశం కూడా వర్తించనుంది.
ఉద్యోగి అనధికారికంగా గైర్హాజరైన విషయం తెలిసిన వెంటనే హాజరు రిజిస్టర్‌లో నమోదు చేసి, కారణాలను వివరిస్తూ షోకాజ్ నోటీసు జారీ చేయాలని అధికారులు ఆదేశించారు. క్రమశిక్షణ చర్యలు ప్రారంభించేందుకు నిర్దిష్ట రోజుల వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని, అవసరమైతే ఒక్కరోజు గైర్హాజరీపైనా చర్యలు ప్రారంభించవచ్చని స్పష్టం చేశారు.
ఎంఈఓ, డీఈఓ, ఆర్జేడీ కార్యాలయాల్లో గైర్హాజరైన ఉద్యోగుల వివరాలు, వారిపై తీసుకున్న చర్యలతో ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, డీఈఓలు, ఆర్జేడీలు గైర్హాజరీ వ్యవహారాలను నిరంతరం పర్యవేక్షించాలని, చర్యల్లో జాప్యం జరిగితే సంబంధిత పర్యవేక్షణ అధికారులను వ్యక్తిగతంగా బాధ్యులను చేసే అవకాశం ఉందని విద్యాశాఖ హెచ్చరించింది.
కేవలం వాట్సాప్‌లో సమాచారం పంపడం, లీవ్ లెటర్ సమర్పించడం మాత్రమే సెలవుకు అనుమతిగా భావించరాదని, నిబంధనల ప్రకారం అధికారికంగా సెలవు మంజూరు అయిన తర్వాతే గైర్హాజరీ చట్టబద్ధమవుతుందని స్పష్టం చేసింది. దీంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది విధులకు హాజరు, సెలవుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది

You may also like...