ప్రభుత్వ బడి ఆట స్థలం పరిరక్షణకు చర్యలు చేపట్టాలి

  • కుత్బుల్లాపూర్,  ప్రగతి నగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆట స్థలాన్ని పరిరక్షించి, విద్యార్థుల క్రీడా అవసరాలకు అందుబాటులో ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిని పాఠశాల ఉపాధ్యాయులు, ప్రగతి నగర్, బండారి లేఔట్ డివిజన్ అధ్యక్షులు కోరారు. ఈ మేరకు ఆయనను కలిసి వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల ఆట స్థలం పరిరక్షణ అంశాన్ని ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మీడియా సమావేశాల ద్వారా కూడా సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. విద్యార్థుల క్రీడా హక్కులను కాపాడటమే లక్ష్యంగా ఈ సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును స్వయంగా కలిసి వినతిపత్రం అందజేసి, ఆట స్థలాన్ని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆట స్థలాన్ని అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రగతి నగర్ డివిజన్ అధ్యక్షుడు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి, బండారి లేఔట్ డివిజన్ అధ్యక్షుడు వరగాని వాసు, డీసీసీ కమిటీ సభ్యుడు మౌళీశ్వర్ రావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You may also like...