మున్సిపల్ పాలనపై సామర్థ్య శిక్షణ

  • పట్టణ పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, పారిశుద్ధ్య వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌సీఐ) ఆధ్వర్యంలో ఒకరోజు సామర్థ్య పెంపు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఏఎస్‌సీఐ కాలేజ్ పార్క్ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలన, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య ప్రమాణాలు తదితర అంశాలపై అధికారులకు నిపుణులు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఏఎస్‌సీఐ రిజిస్ట్రార్ డాక్టర్ ఓ.పి. సింగ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన, ఐఏఎస్ మధ్య పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) పత్రాలను అధికారికంగా మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా మున్సిపల్ అధికారులకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నారు.

కార్యక్రమానికి సీఎంసీ ప్రత్యేక అధికారి, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఏఎస్‌సీఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. రమేష్ కుమార్, శిక్షణ కార్యక్రమాల డీన్ డాక్టర్ వల్లి మణిక్కం, పరిశోధన విభాగం డీన్, సీఈయూజీ అండ్ ఐడీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలాగే సీఎంసీ జోనల్ కమిషనర్లు పర్మార్ పింకేష్‌కుమార్ లలిత్‌కుమార్ (కుత్బుల్లాపూర్ జోన్), మయాంక్ సింగ్ (కూకట్‌పల్లి జోన్), నారాయణ్ అమిత్ మలెంపాటి (సెరిలింగంపల్లి జోన్)తో పాటు పలువురు సీనియర్ మున్సిపల్ అధికారులు హాజరయ్యారు.

డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి నేతృత్వంలో ఏఎస్‌సీఐ నిపుణులు ఉదయ్ సింగ్ గౌతమ్, కె.బి. రంజిత్ కుమార్, డి. ఫణికృష్ణ ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ప్రపంచ, జాతీయ స్థాయిలో ఘన వ్యర్థాల నిర్వహణ విధానాలు, సమస్యలకు మూలకారణాల విశ్లేషణ, ప్రజల్లో సామాజిక అవగాహన కల్పించే పద్ధతులు, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026, భారీ స్థాయిలో వ్యర్థాలను ఉత్పత్తి చేసే సంస్థల బాధ్యతలు, స్వచ్ఛ సర్వేక్షణ్ సూచికలు, ఆకాంక్షిత మరుగుదొడ్ల అభివృద్ధి, ప్రగతి 50 నగరాల కార్యక్రమం వంటి అంశాలపై వివరించారు.

పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించడంతో పాటు వ్యర్థాల నిర్వహణలో ఆధునిక పద్ధతులను అమలు చేసి, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందించేందుకు అధికారుల సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

You may also like...