వైట్‌హౌస్‌ సమీపంలో కాల్పులు.. ఒకరు మృతి

అమెరికా :
అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని వైట్‌హౌస్‌కు సమీపంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. గురువారం ఉదయం నార్త్‌వెస్ట్‌ డీసీలోని లోగాన్‌ సర్కిల్‌ ప్రాంతంలో ఉన్న విడా ఫిట్‌నెస్‌ సెంటర్‌ వద్ద ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 15వ వీధి, పీ వీధి ఎన్‌డబ్ల్యూ కూడలి వద్ద ఉదయం సుమారు 8 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే మెట్రోపాలిటన్‌ పోలీస్‌ విభాగం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. కాల్పుల అనంతరం అనుమానితుడు సమీపంలోని భవనంలోని ఏడో అంతస్తు అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి తలదాచుకున్నాడు. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ బృందాలను రంగంలోకి దించారు. సుమారు గంటపాటు నిందితుడితో చర్చలు జరిపిన అనంతరం అపార్ట్‌మెంట్‌లో తుపాకీ శబ్దం వినిపించడంతో పోలీసులు లోపలికి ప్రవేశించారు. అక్కడ స్వయంగా కాల్చుకున్న గాయాలతో నిందితుడు కనిపించగా, అనంతరం అతడు మరణించినట్లు అసోసియేటెడ్‌ ప్రెస్‌ కథనం వెల్లడించింది.

ఈ ఘటనతో లోగాన్‌ సర్కిల్‌, డ్యుపాంట్‌ సర్కిల్‌ ప్రాంతాల్లో అధికారులు షెల్టర్‌ ఇన్‌ ప్లేస్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని సూచించారు. సమీప పాఠశాలలను ముందుజాగ్రత్తగా లాక్‌డౌన్‌ చేశారు. ప్రధాన రహదారులను మూసివేసి ప్రజల రాకపోకలను నియంత్రించారు. ఏటీఎఫ్‌, ఎఫ్‌బీఐ సహా ఫెడరల్‌ భద్రతా సంస్థలు స్థానిక పోలీసులకు సహకరించాయి. భవనంలోని యజమానుల సంఘంతో నిందితుడికి ఉన్న వివాదం ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని ప్రాథమిక సమాచారం. అయితే కాల్పుల వెనుక అసలు కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. మృతులు, గాయపడిన వారి వివరాలు, నిందితుడి గుర్తింపును వెల్లడించలేదు. వైట్‌హౌస్‌కు సుమారు మైలు దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం అమెరికా భద్రతా వర్గాల్లో ఆందోళనకు కారణమైంది.

You may also like...