ప్రపంచ కార్పొరేట్లో భారతీయుల హవా
- నకిలీ కోర్టు ఉత్తర్వులతో 129 బెట్టింగ్ సైట్లు బ్లాక్! - November 12, 2026
- ఎన్విడియాలో నాయకత్వ సంక్షోభం - November 12, 2026
- ప్రపంచ కార్పొరేట్లో భారతీయుల హవా - November 12, 2026

ప్రపంచ కార్పొరేట్ రంగంలో భారతీయ సంతతి వ్యక్తులు తమ ప్రతిభా సామర్థ్యాలతో అసాధారణ ముద్ర వేస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే బహుళజాతి సంస్థలకు నాయకత్వం వహిస్తూ ప్రపంచ వ్యాపార రంగంలో కీలక నిర్ణయాధికారులుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు విదేశీ సంస్థల్లో ఉద్యోగులుగా ప్రస్థానం ప్రారంభించిన భారతీయులు నేడు అదే సంస్థలకు సీఈవోలుగా మారి ప్రపంచవ్యాప్తంగా తమ నాయకత్వ పటిమను చాటుతున్నారు. తాజాగా విడుదలైన ప్రతిష్టాత్మక ‘హెచ్ఎస్బీసీ హరూన్ గ్లోబల్ ఇండియన్స్ లిస్ట్–2026’ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఈ జాబితాలో గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన నాయకత్వంలోని ఆల్ఫాబెట్ సంస్థ మార్కెట్ విలువ 4.2 ట్రిలియన్ డాలర్లకు చేరడం విశేషం. ప్రపంచ సాంకేతిక రంగంలో ఆల్ఫాబెట్ విస్తరణ, కృత్రిమ మేధ ఆధారిత సేవల అభివృద్ధి, డిజిటల్ వ్యాపార వ్యూహాల్లో సుందర్ పిచాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల రెండో స్థానంలో నిలిచారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ సేవల్లో మైక్రోసాఫ్ట్ విస్తరణకు ఆయన నాయకత్వం వహిస్తున్నారు. మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహ్రోత్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ నాలుగో స్థానంలో, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ ఐదో స్థానంలో నిలిచారు. ప్రపంచ టెక్నాలజీ రంగంలోని అగ్రశ్రేణి సంస్థల నాయకత్వ స్థానాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు నిలవడం దేశానికి గర్వకారణంగా మారింది. హరూన్ నివేదిక ప్రకారం భారత్ వెలుపల ప్రధాన కార్యాలయాలు కలిగిన 200 అంతర్జాతీయ సంస్థలకు 236 మంది భారతీయ సంతతి ప్రముఖులు నాయకత్వం వహిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలోని కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఏకంగా 15 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. 2024లో నమోదైన 9.9 ట్రిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ విలువ 53 శాతం పెరగడం గమనార్హం. ఈ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 53 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు కలిపి 2.5 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించగా, నికర లాభాలు 416 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఈ గణాంకాలు భారతీయ సంతతి నాయకత్వం అంతర్జాతీయ వ్యాపార వ్యవస్థలో ఎంతటి ఆర్థిక ప్రభావాన్ని చూపుతోందో తెలియజేస్తున్నాయి.
ఏఐతో మారుతున్న కార్పొరేట్ సమీకరణాలు:
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ సాంకేతికతకు పెరుగుతున్న ప్రాధాన్యత భారతీయ నాయకత్వంలోని సంస్థలకు కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ 2024 నుంచి దాదాపు 98 శాతం పెరిగింది. ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ 17 శాతం తగ్గినట్లు నివేదిక పేర్కొంది. మరోవైపు మెమరీ చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్ మైక్రాన్ టెక్నాలజీకి అపూర్వమైన వృద్ధిని అందించింది. సంజయ్ మెహ్రోత్రా నేతృత్వంలోని ఈ సంస్థ మార్కెట్ విలువ 1,174 శాతం పెరిగి 1.4 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు నివేదిక వెల్లడించింది. టాప్ ఐదు సంస్థల సంయుక్త మార్కెట్ విలువ 9.1 ట్రిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది మొత్తం జాబితా విలువలో 61 శాతానికి సమానం.
ఏఐ సంస్థలదే ఆధిపత్యం:
హరూన్ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రత్యేక విభాగంగా చేర్చడం సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు నిదర్శనం. ఈ విభాగంలో గుర్తింపు పొందిన 18 సంస్థల మొత్తం విలువ 227 బిలియన్ డాలర్లుగా నమోదైంది. జాబితాలోని సుమారు 103 కంపెనీలు ఏఐ ఆధారిత సేవలను అందిస్తుండగా, వాటి మార్కెట్ విలువ 10.7 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇది మొత్తం జాబితా విలువలో 71 శాతం కావడం విశేషం. స్టార్టప్ రంగంలోనూ ఏఐ సంస్థలు తమ ఆధిపత్యాన్ని చాటుతున్నాయి. 60 బిలియన్ డాలర్ల విలువతో ఏఐ కోడింగ్ సంస్థ ‘కర్సర్’ అగ్రస్థానంలో నిలిచింది. అత్యంత విలువైన పది స్టార్టప్‌లలో ఏడు కంపెనీలు ఏఐ రంగానికి చెందినవే కావడం గమనార్హం. ఈ సంస్థలన్నీ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. రంగాలవారీగా పరిశీలిస్తే 53 కంపెనీలతో సాఫ్ట్వేర్, సర్వీసెస్ విభాగం మొదటి స్థానంలో ఉండగా, 31 సంస్థలతో ఫైనాన్షియల్ సర్వీసెస్, 21 సంస్థలతో హెల్త్‌కేర్ రంగాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
భారతీయ ప్రతిభకు ప్రపంచ గుర్తింపు:
అంతర్జాతీయ స్థాయిలో భారతీయులు సాధిస్తున్న ఈ విజయాల వెనుక నాణ్యమైన విద్య, సాంకేతిక పరిజ్ఞానం, కఠోర శ్రమ, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, వ్యాపార దూరదృష్టి వంటి అంశాలు కీలకంగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ భారతీయ సంతతి నిపుణులు అత్యున్నత నాయకత్వ స్థానాలను అధిరోహించడం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఏఐ, సెమీకండక్టర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలు, వైద్య సాంకేతిక రంగాల్లో భారతీయుల ప్రాతినిధ్యం పెరుగుతుండటం అంతర్జాతీయ వ్యాపార రంగంలో వస్తున్న పరివర్తనను సూచిస్తోంది. అయితే ఈ విజయాలను భారత్‌లో పరిశోధన, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధి, నైపుణ్య శిక్షణకు అనుసంధానం చేయగలిగితే దేశీయ ఆర్థిక వ్యవస్థకు కూడా మరింత ప్రయోజనం చేకూరుతుంది. ప్రపంచాన్ని నడిపిస్తున్న కార్పొరేట్ నాయకత్వంలో భారతీయుల పాత్ర విస్తరిస్తుండటం భారత మేధోసంపత్తికి లభిస్తున్న అంతర్జాతీయ గుర్తింపుగా నిలుస్తోంది.
