రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) ఖనిజ అన్వేషణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు హైదరాబాద్లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) శిక్షణ సంస్థలో నూతన సాంకేతిక వసతులు అందుబాటులోకి వచ్చాయి. జీఎస్ఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ హాస్టల్, అత్యాధునిక జియోఫిజికల్ డేటా ప్రాసెసింగ్ ల్యాబొరేటరీ, ‘కర్మయోగి’ డిజిటల్ స్టూడియోలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయమైన వికసిత భారత్ సాధనలో గనుల శాఖ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. దేశంలో బొగ్గు, ఇతర ఖనిజ సంపదను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అన్వేషించి, శాస్త్రీయంగా గుర్తించడం అవసరమని పేర్కొన్నారు. ఖనిజ వనరుల గుర్తింపు, పరిశోధనలో జీఎస్ఐ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో సంస్థ మరింత ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రతిష్టాత్మక జీఎస్ఐ శిక్షణ సంస్థ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉండటం గర్వకారణమన్నారు. దేశాభివృద్ధికి శాస్త్రవేత్తలు, అధికారులు చేస్తున్న పరిశోధనలు మరింత విజయవంతం కావాలని ఈటల రాజేందర్ ఆకాంక్షిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జీఎస్ఐ డైరెక్టర్ జనరల్ దినేష్ వి. గన్వీర్, గనుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఫరీదా ఎం. నాయక్, జీఎస్ఐటీఐ ప్రతినిధి ఎస్. రవి, ఏ.డీ.జీ. వి.వి. మొఘల్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
