మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసుల నోటీసులు..
- మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి! - November 10, 2026
- అక్షర్ పటేల్‌కు చెన్నై గాలం.. - November 10, 2026
- మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసుల నోటీసులు.. - November 10, 2026

జ్ఞాన తెలంగాణ, జాతీయం:
పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2013లో ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని పోలీసులు ఆమెను కోరారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 160 కింద ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. విచారణాధికారిని ఎప్పుడు, ఎక్కడ కలవాలన్నది ఆమె సౌకర్యాన్ని బట్టి నిర్ణయించుకోవచ్చని సూచించారు. దాదాపు 13 ఏళ్ల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పుడు మమతా బెనర్జీ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలేం జరిగింది? 2013లో ఢిల్లీలోని నాటి ప్రణాళికా సంఘం కార్యాలయం సమీపంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ సమయంలో మమతా బెనర్జీ తన పార్టీ నేతలు, మంత్రులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆమె బృందాన్ని చుట్టుముట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అప్పటి పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రాపై దాడి జరిగిందని, ఆయనతో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం, అల్లర్లకు పాల్పడటం వంటి ఆరోపణలతో ఐపీసీ సెక్షన్లు 186, 353, 332, 147, 149, 34 కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో అప్పటి ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి రితబ్రత బెనర్జీని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
తాజాగా ఈ కేసులో మరిన్ని వివరాలు సేకరించేందుకు దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన సమయంలో అక్కడి పరిస్థితులు, జరిగిన పరిణామాలపై మమతా బెనర్జీకి అవగాహన ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆమెను నిందితురాలిగా కాకుండా సాక్షిగా విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో ఆమె ఇచ్చే వివరాలు కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఈ కేసు మళ్లీ తెరపైకి రావడం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఢిల్లీ పోలీసుల నోటీసులపై మమతా బెనర్జీ లేదా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన వెలువడలేదు. ఆమె విచారణకు ఎప్పుడు హాజరవుతారనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. 2013 నాటి ఘటనపై దర్యాప్తు ఏ దిశగా సాగుతుందో రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
