పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం..

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: భాగ్యనగరంలో పీవీఎన్ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై మరో రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. రాజేంద్రనగర్‌ పరిధిలోని పిల్లర్‌ నంబర్‌ 165 వద్ద రెండు కార్లు బలంగా ఢీకొన్నాయి. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్‌ వైపు వెళ్తున్న కియా కారు అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో కియా కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఢీకొన్న తీవ్రతకు కారు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే కారు డ్రైవర్‌ ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకుని స్వల్ప గాయాలతో బయటపడటం ఊరటనిచ్చింది. ప్రమాదం కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనదారులు వేగ నియంత్రణ పాటించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

You may also like...