ఎంఆర్‌పీ దాటితే కఠిన చర్యలు

 
 బియ్యం ధరలపై ప్రభుత్వం నియంత్రణ.. కృత్రిమ కొరత సృష్టిస్తే ఉపేక్షించేది లేదు
బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలపై నిఘా.. పునరావృతమైతే పీడీ యాక్ట్ ప్రయోగం
బిపిటి, కేఎన్‌ఎం కిలో రూ.66.. తెలంగాణ సోనా, ఆర్‌ఎన్‌ఆర్ రూ.74.. హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రూ.79 గరిష్ట ధర

**హైదరాబాద్:** రాష్ట్రంలో బియ్యం కొరత ఉందంటూ వస్తున్న వార్తలు, మార్కెట్లో అకారణంగా పెరుగుతున్న ధరలపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బియ్యం వ్యాపారంలో కృత్రిమ కొరత సృష్టించి, అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. సామాన్య ప్రజలు మోసపోకుండా, నిత్యావసరమైన బియ్యం సరసమైన ధరలకు అందుబాటులో ఉండేలా మార్కెట్‌పై నిరంతర పర్యవేక్షణ చేపట్టింది.

ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ డైరెక్టర్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ (సీఆర్ఓ) జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బియ్యం కొరత ఉందంటూ వస్తున్న వదంతులను ప్రజలు, రిటైల్ వ్యాపారులు నమ్మవద్దని సూచించారు. కొందరు దళారులు ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి ప్రచారాలకు వ్యాపారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

రిటైల్ వ్యాపారులకు బియ్యం నిల్వల సమస్య ఎదురైతే హోల్‌సేల్ వ్యాపారులపై ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత జిల్లా పౌరసరఫరాల అధికారి (డీసీఎస్‌ఓ)ను నేరుగా సంప్రదించి, తమకు అవసరమైన బియ్యం పరిమాణానికి సంబంధించి ఇండెంట్ సమర్పించాలని సూచించారు. తద్వారా నేరుగా రైస్ మిల్లర్ల నుంచే బియ్యం సరఫరా పొందే అవకాశం ఉందని తెలిపారు.

మార్కెట్లో అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ ధరల పెంపునకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా 25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోల స్టిక్కర్లు వేసి వినియోగదారులను మోసం చేయడం, అసలు గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ) కనిపించకుండా అధిక ధరలతో నకిలీ స్టిక్కర్లు అతికించి విక్రయించడం వంటి అక్రమాలపై తనిఖీ బృందాలు ప్రత్యేక దృష్టి సారించాయి.

వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల బియ్యానికి గరిష్ట ధరలను నిర్ణయించారు. బిపిటి, కేఎన్‌ఎం రకాల బియ్యం కిలో ధర రూ.66కు మించకూడదు. ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోనా రకాల ధర కిలోకు రూ.74గా, హెచ్‌ఎంటీ, జేఎస్‌ఆర్ రకాల ధర కిలోకు రూ.79గా పరిమితం చేశారు.

నిర్ణయించిన ధరలకు మించి విక్రయాలు జరిపితే సంబంధిత వ్యాపారులపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు బియ్యం కొనుగోలు సమయంలో బస్తాపై ఉన్న ఎంఆర్‌పీ, తూకాన్ని తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ధరల నియంత్రణ, అక్రమాల అరికట్టడం కోసం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతాయని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

You may also like...