కదులుతున్న బస్సులో బాలికపై దారుణం

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కదులుతున్న ప్రైవేట్‌ బస్సులో 16 ఏళ్ల బాలికపై డ్రైవర్‌, కండక్టర్‌ అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఆగస్టు 4న జరిగిన ఈ ఘటన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. నిందితులుగా గుర్తించిన బస్సు డ్రైవర్‌ కుల్దీప్‌, కండక్టర్‌ సందీప్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి, బస్సును సీజ్‌ చేశారు. బాలిక స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లా అని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. కుటుంబ సభ్యులతో జరిగిన వివాదం అనంతరం బాలిక ఎవరికీ చెప్పకుండా నోయిడాలోని బంధువుల ఇంటికి బయలుదేరింది. భారీ వర్షం, చీకటి కారణంగా మార్గం తప్పి పరి చౌక్‌ వద్ద బస్సు దిగింది. నోయిడా వెళ్లే మరో బస్సు కోసం ఎదురుచూస్తుండగా స్లీపర్‌ బస్సు అక్కడికి వచ్చింది. నోయిడా వెళ్తుందా అని కండక్టర్‌ను అడగగా అతడు అవునని చెప్పడంతో బాలిక బస్సు ఎక్కింది.

అయితే నమ్మకంతో బస్సెక్కిన బాలికను రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న డ్రైవర్‌, కండక్టర్‌ అత్యంత దారుణానికి పాల్పడ్డారని పోలీసులు ఆరోపిస్తున్నారు. అనంతరం అర్ధరాత్రి కశ్మీర్‌గేట్‌ సమీపంలోని రింగ్‌ రోడ్డు వద్ద బాలికను వదిలి నిందితులు వెళ్లిపోయారు. తీవ్ర ఆందోళనకు గురైన బాలిక పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిమర్‌పూర్‌ వద్ద బస్సును గుర్తించి అడ్డుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఎక్కించుకున్న అనంతరం బస్సు దాదాపు 47 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి కశ్మీర్‌గేట్‌ ప్రాంతానికి చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

You may also like...