New Parliament House: కొత్త ఎంపీలకోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న పార్లమెంటు !
- A Hero’s Journey to Conquer New Horizons - May 23, 2025
- Playing It Safe: Tips and Tricks for Shaolin Soccer - May 23, 2025
- Uncovering the Mystery of 3 Carts of Gold’s Bonus System - May 23, 2025

New Parliament House: కొత్త ఎంపీలకోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్న పార్లమెంటు !
_ జూన్ 4 నుంచే ఎంపీలు వచ్చే అవకాశం !
లోక్‌సభ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. మరో రెండు దశల్లో ఎన్నికలు పూర్తవగానే జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు. దీనితో కొత్తగా ఎన్నిక కాబోయే ఎంపీలకు ఘన స్వాగతం పలికేందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. కొత్త పార్లమెంటు భవనం వెలుపల బ్యూటిఫికేషన్ పనులు కొనసాగుతుండడంతో… దాని అనుబంధ భవనంలో కొత్త ఎంపీలకు ఘన స్వాగతం పలికేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారిక వేడుకలకు వీలుగా కొత్తగా గ్రీనరీను ఏర్పాటు చేసి, విగ్రహాలను వేరేచోటకు తరలించడం, ఎంపీలు తమ వాహనాల నుంచి దిగి బ్యాటరీ వాహనాల్లోకి మారే ప్రదేశాలను కేటాయించడం వంటివి ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
దీనితో మునుపటి మాదిరిగా వర్తులాకార భవనం (ప్రస్తుత సంవిధాన్ సదన్)లో కాకుండా అనుబంధ భవనంలో ఎంపీలను స్వాగతించనున్నారు. ఢిల్లీలోని రాష్ట్ర ప్రభుత్వాల అతిథి గృహాల్లో, ‘వెస్టర్న్ కోర్ట్ హాస్టల్ కాంప్లెక్స్’లో లోక్‌సభ నూతన సభ్యులకు తాత్కాలిక వసతి కల్పిస్తారు. మాజీ సభ్యులు తమ అధికారిక నివాసాలు ఖాళీ చేసేందుకు కొంత గడువు ఉంటుంది. వాటికి అవసరమైన మరమ్మతులతో ఆ తర్వాత మెరుగులు దిద్ది, కొత్తవారికి కేటాయిస్తారు.
జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండడంతో ఆరోజు సాయంత్రం నుంచే నూతన సభ్యులు ఢిల్లీకి చేరుకుంటారని భావిస్తూ లోక్‌సభ సచివాలయం తగిన ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంటు భవనంలో ప్రవేశానికి, వివిధ సదుపాయాలు పొందడానికి అవసరమైన స్మార్ట్‌కార్డుల కోసం నూతన సభ్యులు వేర్వేరు దరఖాస్తులు నింపాల్సి ఉంటుంది. వాటిని స్వీకరించి, వారిని ఫోటో తీసేందుకు బాంకెట్ హాల్లో, ఇతర గదుల్లో ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయం, రాజధానిలోని వివిధ రైల్వేస్టేషన్లలో ఆహ్వాన కేంద్రాలు ఉంటాయి. కొత్త సభ్యులను అక్కడి నుంచి పార్లమెంటు భవనానికి తీసుకువెళ్తారు.
వారికి కొత్త ఫోన్ కనెక్షన్లు, వాహనాల ఫాస్టాగ్ స్టిక్కర్లు, నూతన బ్యాంకు ఖాతాలు, దౌత్యపరమైన పాస్‌పోర్టులు, అధికారిక ఈ-మెయిల్ ఖాతాలు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో సభ్యత్వం వంటివి ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
