కాంగ్రెస్ గూటిలో మంట!
- ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా సజ్జనార్ బాధ్యతల స్వీకరణ - November 19, 2026
- వరంగల్ దంపతుల ఆత్మహత్యపై డీజీపీ సీవీ ఆనంద్ దిగ్భ్రాంతి - November 19, 2026
- సైఫ్ అలీఖాన్‌కు బెదిరింపులు.. - November 19, 2026

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసమ్మతి అగ్గిరాజుకుంది. బయట ప్రతిపక్షాలు విమర్శలు చేయడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ తీరుపై గళమెత్తడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. అధికారముంది కదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ఖబడ్దార్ బిడ్డా రేవంత్‌రెడ్డి.. యుద్ధం మొదలవుతుందని ఆయన హెచ్చరించినట్లు వచ్చిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. మూడేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని ఆయన చేసిన విమర్శ ప్రభుత్వ పనితీరుపై సొంత పార్టీ నుంచే వస్తున్న అసంతృప్తికి అద్దం పడుతోంది.
నాలుగు గోడల మధ్య సమస్యలు చెప్పినా పట్టించుకోవడం లేదని, బయట మాట్లాడితే క్రమశిక్షణ పేరుతో బెదిరిస్తున్నారని రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. అంటే పార్టీలో సమస్యలు చెప్పుకునే దారులు మూసుకుపోయాయా? ప్రజాప్రతినిధుల మాటలకు విలువ లేకుండా పోయిందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రజల మధ్య తిరిగే ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం సహజం. అలాంటి అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసినప్పుడు క్రమశిక్షణ చర్యల హెచ్చరికలు రావడం పార్టీలో ప్రజాస్వామ్య చర్చకు తావుందా అనే సందేహాలను రేకెత్తిస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. రేవంత్‌రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను అధిష్ఠానానికి పంపినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. సమయం వచ్చినప్పుడు సంబంధిత నేతలందరినీ పిలిచి మాట్లాడతామని, ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమేనని పేర్కొన్నారు.
అయితే ఈ వ్యవహారం కేవలం ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యలకే పరిమితమా? లేక కాంగ్రెస్‌లో పేరుకుపోతున్న అసంతృప్తికి సంకేతమా? అన్న చర్చ మొదలైంది. ప్రజల సమస్యలపై మాట్లాడే నాయకులకు పార్టీ వేదికలపై ఎంతవరకు అవకాశం కల్పిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అసమ్మతి గొంతులను క్రమశిక్షణ పేరుతో అణచివేస్తారా? లేక వారి అభిప్రాయాలను విని పరిష్కార మార్గం చూపుతారా? అన్నది అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. మొత్తానికి కాంగ్రెస్ గూటిలో రేగిన ఈ మంటకు పార్టీ నాయకత్వం ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.
