సుష్మిత మృతిపై న్యాయపోరాటం:ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

మహబూబాబాద్ ప్రతినిధి:

ఆడబిడ్డ ప్రాణం పోయిన తర్వాత పరామర్శలతో సరిపెడతారా? కులం పేరుతో అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆరోపణలు ఉన్న యువతి అనుమానాస్పద మృతిపై న్యాయం ఎప్పుడు జరుగుతుంది? బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి లేదా? అంటూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. మహబూబాబాద్ జిల్లా నడివాడలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన సుష్మిత కుటుంబాన్ని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోతు కవితతో కలిసి పరామర్శించారు.

ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సుష్మిత మరణాన్ని కేవలం ఆత్మహత్యగా పరిగణించకుండా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాల ఆధారంగా హత్య కోణంలోనూ సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన బీజేపీ సర్పంచ్ కులం పేరుతో అవమానించారని, ప్రేమ పేరుతో మోసం చేసిన అనిల్, అతని కుటుంబ సభ్యుల వేధింపులు ఉన్నాయని ఆరోపించారు. సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ప్రతి ఒక్కరి పాత్రను నిష్పక్షపాతంగా విచారించి, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి రావాల్సిన రూ.4.12 లక్షల పరిహారాన్ని వెంటనే అందించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, కేసు త్వరితగతిన పరిష్కారమయ్యేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మార్వో, డీఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి దర్యాప్తు, పరిహారం, చార్జిషీట్ దాఖలుపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్‌తో బాధిత కుటుంబ సభ్యులను ఫోన్‌లో మాట్లాడించి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని, ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం నిరుద్యోగ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి, జిల్లా గ్రంథాలయంలో యువతతో సమావేశమయ్యారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేదరికం చదువుకు అడ్డంకి కాదని, పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలని యువతకు సూచించారు. సుష్మిత మృతిపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

You may also like...