వరంగల్ దంపతుల ఆత్మహత్యపై డీజీపీ సీవీ ఆనంద్ దిగ్భ్రాంతి

వరంగల్ :

చిన్న మొత్తంలో తీసుకున్న అప్పు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన వరంగల్ జిల్లా రంగశాయిపేటలో చోటుచేసుకుంది. వారానికి కేవలం రూ.750 అప్పు చెల్లించలేక దంపతులు ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ హృదయవిదారక ఘటనపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల తనను తీవ్రంగా కలచివేసిన ఘటనల్లో ఇదొకటని భావోద్వేగంగా స్పందించారు.

దంపతులు రాసిన సూసైడ్ నోట్ మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను కళ్లకు కట్టిందని పేర్కొన్నారు. తమ మరణం తర్వాత పెంపుడు కుక్కకు ఆహారం ఎవరు పెడతారనే ఆవేదనతో దానిని కూడా చంపేయడం తనను మరింత కలచివేసిందని తెలిపారు.

మరోవైపు పోలీస్ సిబ్బందిలో కొందరు సైతం ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌లకు బానిసలై అప్పుల ఊబిలో చిక్కుకోవడంపై డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక సమస్యలు, అప్పుల ఒత్తిడికి జీవితాన్ని బలిచేసుకోవడం పరిష్కారం కాదని, ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని సహాయం పొందాలని సూచించారు. ఈ ఘటన ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనాలు, అప్పుల ఒత్తిడిపై సమాజం అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది.

You may also like...