ఆయిల్‌పామ్‌లో తెలంగాణ అగ్రస్థానం!

జ్ఞాన తెలంగాణ,వెబ్ డెస్క్:

ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో దూసుకుపోతోంది. రైతులకు అధిక ఆదాయం అందించడంతో పాటు వంటనూనెల దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 15.70 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగవుతుండగా, తెలంగాణలోనే 91,343 మంది రైతులు 3.33 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. దీంతో దేశంలోని మొత్తం ఆయిల్‌పామ్‌ సాగులో తెలంగాణ 21 శాతం వాటాను కలిగి ఉంది. రాష్ట్రంలో ఈ పంటకు రైతుల నుంచి ఆదరణ పెరుగుతుండటం వ్యవసాయ రంగంలో కీలక పరిణామంగా మారింది.

2023 డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకు మరో 45,679 మంది రైతులను 1.50 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగులోకి తీసుకొచ్చారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.430 కోట్ల ఆర్థిక సాయం అందించింది. రైతులను ప్రోత్సహించేందుకు ఎకరాకు రూ.46,250 చొప్పున రాయితీ కల్పిస్తోంది. సాగు విస్తరణతో పాటు పంట కొనుగోలు, ప్రాసెసింగ్‌ సదుపాయాల కల్పనపై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో 25,242 మంది రైతుల నుంచి 5.24 లక్షల టన్నుల ఆయిల్‌పామ్‌ గెలలను కొనుగోలు చేసి రూ.1,213 కోట్లు చెల్లించారు. ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ రేషియోలో తెలంగాణ 20.01 శాతం సాధించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అంటే పామాయిల్‌ గెలల నుంచి నూనెను వెలికితీసే సామర్థ్యంలో రాష్ట్రం ముందంజలో ఉంది. ఈ ఫలితాలు ఆయిల్‌పామ్‌ సాగు, ప్రాసెసింగ్‌ రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న పురోగతిని సూచిస్తున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు ఆయిల్‌పామ్‌ ప్రాసెసింగ్‌ మిల్లులు పనిచేస్తుండగా, వచ్చే ఏడాది మరో ఎనిమిది మిల్లులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాసెసింగ్‌ సామర్థ్యం పెరిగితే రైతులకు పంట విక్రయాల్లో సౌలభ్యం కలగడంతో పాటు రవాణా ఖర్చులు, గెలల నిల్వ సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా కనీసం 10 లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్‌ సాగును విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

ఇదిలా ఉండగా, ఆయిల్‌పామ్‌ రైతులు తమ సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. టన్ను ఆయిల్‌పామ్‌ గెలలకు కనీస ధరగా రూ.25 వేలు నిర్ణయించాలని, ఆదాయ పంపిణీ నిష్పత్తిని ప్రస్తుతం ఉన్న 75:25 నుంచి 80:20కి మార్చాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగుకు ప్రోత్సాహకాలు, ప్రాసెసింగ్‌ మౌలిక వసతులు కల్పిస్తే ఆయిల్‌పామ్‌ తెలంగాణ వ్యవసాయ రంగంలో మరింత కీలక పంటగా ఎదిగే అవకాశాలున్నాయి.

You may also like...