అవయవదానం తో మానవత్వం చాటుకున్న పోలీస్ కుటుంబం

  •  ఉద్యోగి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీస్ (జీఆర్పీ) విభాగంలో ఆర్మ్డ్ రిజర్వ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈ. నర్సింహ (57) తీవ్ర అనారోగ్యంతో బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించబడ్డారు. భర్త పరిస్థితి విషమించడంతో ఆయన భార్య ఈ. లక్ష్మి అవయవదానానికి అంగీకరించి మానవతను చాటుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కోడూరు గ్రామానికి చెందిన నర్సింహ కొంతకాలంగా తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతూ నాలుగు విడతలుగా డయాలసిస్ చేయించుకున్నారు. ఈ నెల 3వ తేదీన తీవ్ర జ్వరం, నీరసం, అధిక రక్తపోటుతో స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో నవంబర్ 10వ తేదీన బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.
ఈ క్రమంలో భార్య లక్ష్మి తన భర్త అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకోగా కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. అయితే వైద్య పరీక్షల్లో మూత్రపిండాలు మార్పిడికి అనుకూలంగా లేకపోవడం, కాలేయంలో సెప్సిస్‌కు సంబంధించిన ఇన్‌ఫ్లమేషన్ లక్షణాలు ఉండటం, శ్వాస సంబంధిత సమస్యల కారణంగా గుండె, ఊపిరితిత్తులను సేకరించడం సాధ్యం కాలేదు. దీంతో అవయవాలేవీ ఇతరులకు మార్పిడి చేయడానికి వినియోగించలేకపోయారు.
ఈ వివరాలను తెలంగాణ రాష్ట్ర అవయవ, కణజాల మార్పిడి సంస్థ (జీవందాన్–SOTTO) నవంబర్ 11న విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది. అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చిన భార్య లక్ష్మి నిర్ణయం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.

You may also like...