ఎండ్రియాల్‌లో చరిత్రకు ఘన నివాళి.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి భూమిపూజ

తాడ్వాయి: బ్రిటిష్ పాలకుల అకృత్యాలను ఎదిరించి దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ప్రతిష్ఠాపనకు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల్ గ్రామంలో భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా తమ గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టడం గర్వకారణమని గ్రామస్తులు తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 1846లోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడారు. వడ్డే ఓబన్నతో పాటు రైతులు, వివిధ సామాజిక వర్గాల ప్రజలను ఏకం చేసి బ్రిటిష్ పాలకుల అన్యాయాలను ఎదిరించారు. 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి పదేళ్ల ముందే పోరాటం ప్రారంభించిన వీరుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. 1847 ఫిబ్రవరి 22న బ్రిటిష్ పాలకులు ఆయనను ఉరితీశారు. ఆయన త్యాగం, ధైర్యసాహసాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. దేశభక్తి, ధైర్యం, సామాజిక ఐక్యత, ఆత్మగౌరవ భావాలను యువతలో పెంపొందించడంతో పాటు స్వాతంత్ర్య పోరాట చరిత్రను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండ్రియాల్ గ్రామ రెడ్డిసంఘం అధ్యక్షులు బాణాల పెద్ద గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి రెడ్డిగారి సిద్ధిరాంరెడ్డి, గ్రామ సర్పంచ్ కొర్ని నర్సింలు, ఉపసర్పంచ్ గడ్డం పెద్ద నర్సారెడ్డి, రెడ్డిసంఘం పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

You may also like...