పోలీసుల పనితీరే ప్రతిష్ఠ!
- భూ రీసర్వేలో నిర్లక్ష్యం వద్దు! - November 10, 2026
- కరవు కోరల్లో రైతులు.. - November 10, 2026
- బీసీ ర్యాలీకి రాహుల్‌కు ఆహ్వానం! - November 10, 2026

పోలీసు అధికారుల పనితీరే ప్రభుత్వ ప్రతిష్ఠకు గీటురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను విస్మరించి కొందరు అధికారులు అరాచకాలకు పాల్పడితే మొత్తం ప్రభుత్వ పాలనపైనే నిందలు పడతాయని హెచ్చరించారు. అదే అధికారులు నిబద్ధతతో, నిజాయితీతో విధులు నిర్వర్తిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ దేశవ్యాప్తంగా పెరుగుతుందని పేర్కొన్నారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీలో శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ డీఎస్పీల వీడ్కోలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు. శిక్షణ సమయంలో ట్రెయినీలు తీసుకున్న ఛాయాచిత్రాల ప్రదర్శనను తిలకించి, క్రైమ్ సీన్ ఫోరెన్సిక్స్ హ్యాండ్‌బుక్‌ను ఆవిష్కరించారు. ప్రతిభ కనబరిచిన పలువురు ట్రెయినీ డీఎస్పీలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసు అధికారులుగా ఎంతటి ఉన్నత హోదాకు చేరుకున్నా తమ గతాన్ని, వచ్చిన నేపథ్యాన్ని మరిచిపోవద్దని హితవు పలికారు. మన మూలాలను విస్మరిస్తే మన హోదాకు న్యాయం చేయలేమని స్పష్టం చేశారు. ప్రత్యేక లక్ష్యంతో పోలీసు శాఖలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. శిక్షణ పూర్తయిందంటే లక్ష్య సాధన ముగిసినట్లు కాదని, వాస్తవ ప్రజాసేవకు ఇప్పుడు రెండో అధ్యాయం ప్రారంభమవుతుందని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా మమేకమై పనిచేయాల్సిన బాధ్యత డీఎస్పీలదేనని, బాధితుల సమస్యలను ఓపికగా విని వాటి మూలాలను అర్థం చేసుకోవాలని సూచించారు. సమస్య ఏమిటో తెలుసుకుంటే పరిష్కారంలో సగం విజయం సాధించినట్లేనని పేర్కొన్నారు. ప్రజలు ఏ ఆపద వచ్చినా ముందుగా పోలీసులను ఆశ్రయిస్తారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉందన్నారు. దశాబ్దాలుగా ప్రాణాలను పణంగా పెట్టి శాంతిభద్రతలను కాపాడిన సీనియర్ పోలీసుల సేవల వల్లే శాఖకు సమాజంలో గౌరవం లభించిందని గుర్తుచేశారు. ఆ గౌరవాన్ని దెబ్బతీయకుండా మరింత పెంచాలని సూచించారు.
మారుతున్న నేరాల స్వరూపాన్ని ఎదుర్కొనేందుకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని సీఎం సూచించారు. గతంలో దొంగసారాయి వంటి అక్రమ కార్యకలాపాలు ప్రధాన సవాలుగా ఉండేవని, ప్రస్తుతం కొకైన్, హెరాయిన్, గంజాయి వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా తీవ్ర సమస్యగా మారిందన్నారు. డ్రగ్స్ వ్యవహారాల్లో ఎంతటి పలుకుబడి ఉన్నవారు ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇందుకోసమే ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ నియంత్రణ, ఫుడ్ సేఫ్టీ, డ్రగ్స్, సైబర్ నేరాలు వంటి రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం అవసరమని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నేరగాళ్లు దూర ప్రాంతాల నుంచి ప్రజల బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారని, ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. సీఐడీ, ఏసీబీ, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక విభాగాల మాదిరిగా కొత్త అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాలను పెంచుకోవాలని సూచించారు. నూతన డీఎస్పీలు తమ నైపుణ్యాలకు అనుగుణంగా ప్రత్యేక విభాగాలను ఎంచుకోవచ్చని, అవసరమైతే దేశ, విదేశాల్లోని అత్యుత్తమ సంస్థల్లో ఒకటి, రెండేళ్లపాటు శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
గ్రూప్-1 నియామకాలపై మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన జాప్యం, ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయిందని సీఎం విమర్శించారు. 2011 తర్వాత 2025లోనే గ్రూప్-1 నియామకాలు పూర్తయ్యాయని గుర్తుచేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో రాజకీయ పునరావాసాలకు అవకాశం కల్పించడం వల్ల నియామకాల వ్యవస్థపై నిరుద్యోగుల్లో నమ్మకం దెబ్బతిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిషన్‌ను ప్రక్షాళన చేసి, యూపీఎస్సీ చైర్‌పర్సన్‌తో పాటు నిపుణుల సలహాలు తీసుకొని అనుభవజ్ఞులను నియమించామని తెలిపారు. ఒకేసారి 562 గ్రూప్-1 ఖాళీల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని, అందులో 119 మంది డీఎస్పీలుగా ఎంపికయ్యారని వెల్లడించారు. నియామకాల ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ శాంతికుమారి, హోంశాఖ కార్యదర్శి శిఖా గోయల్, రాష్ట్ర భద్రతా సలహాదారు బి.శివధర్ రెడ్డి, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు యూనిఫాం కేవలం హోదాకు చిహ్నం కాదని, అది ప్రజల భద్రతకు, న్యాయానికి, బాధ్యతకు ప్రతీకగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.




