మాడల్ స్కూళ్లకు గ్రహణం
- ఆదివాసి గిరిజన బిడ్డ శిరీష కుటుంబానికి న్యాయం జరగాలి - August 31, 2026
- చెల్లి.. బుజ్జి అంటూ వివాహితతో కానిస్టేబుల్ రాసలీలలు! - August 31, 2026
- 21 ఏళ్ల తర్వాత.. ‘నా కొడుకు తండ్రివి నువ్వే’ అంటూ ధర్నా - August 31, 2026

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ మాడల్ స్కూళ్ల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పేరుకు ‘మాడల్’ స్కూళ్లుగా ఉన్నా.. ఆచరణలో మాత్రం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా భారీగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాల్సిన పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల కొరత వెంటాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మాడల్ స్కూళ్లలో మొత్తం 3,880 టీచర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం సుమారు 2,800 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఏకంగా 1,080 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం పోస్టుల్లో దాదాపు 27 శాతం ఖాళీగా ఉండటం మాడల్ స్కూళ్ల దుస్థితికి అద్దం పడుతోంది.
ప్రిన్సిపాల్ పోస్టులు 97, పీజీటీ పోస్టులు 560, టీజీటీ పోస్టులు 409కిపైగా ఖాళీగా ఉన్నట్లు సమాచారం. కీలకమైన బోధనా విభాగాల్లోనే ఇంత భారీ స్థాయిలో ఖాళీలు ఉండటంతో విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఒకవైపు విద్యార్థులకు పోటీ ప్రపంచానికి అనుగుణంగా నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం పెరుగుతుండగా, మరోవైపు అవసరమైన స్థాయిలో ఉపాధ్యాయులు లేకపోవడం పాఠశాలల నిర్వహణను కష్టతరం చేస్తోంది. కొన్ని సంవత్సరాలుగా పదవీ విరమణలు, రోడ్డు ప్రమాదాలు, అనారోగ్య కారణాలతో ఉపాధ్యాయులు మృతి చెందడం వంటి కారణాలతో ఖాళీలు పెరుగుతున్నా.. వాటిని భర్తీ చేసేందుకు సమర్థవంతమైన నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మాడల్ స్కూళ్లలో ఖాళీలు మాత్రమే కాకుండా విద్యార్థుల ప్రవేశాల్లోనూ గణనీయమైన పతనం కనిపిస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో ఏకంగా 51 వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సుమారు 15 వేల అడ్మిషన్లు తగ్గడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు మాడల్ స్కూళ్లలో సీటు కోసం పోటీ ఉండేది. 2017లో రికార్డు స్థాయిలో ఏకంగా 1.36 లక్షల సీట్లు నిండాయి. కానీ ఆ తర్వాత క్రమంగా ప్రవేశాలు తగ్గుతూ వస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రత్యామ్నాయ విద్యాసంస్థల వైపు మళ్లుతుండటంతో మాడల్ స్కూళ్లలో సీట్లు ఖాళీగా మిగిలే పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ పరిణామానికి గురుకుల విద్యాసంస్థల ప్రభావం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గురుకులాల్లో 5వ తరగతి నుంచే ప్రవేశాలు కల్పిస్తుండగా, మాడల్ స్కూళ్లలో 6వ తరగతి నుంచి అడ్మిషన్లు జరుగుతున్నాయి. దీంతో 5వ తరగతిలోనే గురుకులాల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. వసతి సౌకర్యం, మెరుగైన మెనూ, చదువుకు అనుకూలమైన వాతావరణం వంటి అంశాలు గురుకులాల వైపు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. దీనికి విరుద్ధంగా మాడల్ స్కూళ్లలో ప్రధానంగా విద్యతో పాటు మధ్యాహ్న భోజన సదుపాయం మాత్రమే ఉండటం కూడా విద్యార్థుల ఎంపికపై ప్రభావం చూపుతోంది. గురుకులాల్లో చేరిన తర్వాత మిగిలే విద్యార్థులను మాడల్ స్కూళ్లతో పాటు జిల్లా పరిషత్, ఇతర ప్రభుత్వ పాఠశాలలు పంచుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితి మాడల్ స్కూళ్లలో అడ్మిషన్లు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భూతం యాకమల్లు విశ్లేషించారు.
మరోవైపు మాడల్ స్కూళ్లలో ఇంటర్ విద్య అందుబాటులో ఉన్నప్పటికీ, విద్యార్థుల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సుల ఎంపిక జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ వంటి డిమాండ్ ఉన్న కోర్సులను అందించకుండా ఎంఈసీ, సీఈసీ వంటి కోర్సులనే కొనసాగిస్తున్నారు. పదో తరగతి తర్వాత ఎంపీసీ, బైపీసీ చదవాలని భావించే విద్యార్థులు మాడల్ స్కూళ్లలో ఆ అవకాశం లేకపోవడంతో ఇతర ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీల వైపు వెళ్లాల్సి వస్తోంది. దీంతో మాడల్ స్కూళ్లలో ఇంటర్ స్థాయిలోనూ విద్యార్థులను నిలుపుకోవడం కష్టంగా మారుతోంది.
ఇక మాడల్ స్కూళ్ల విషయంలో విద్యాశాఖ, ప్రభుత్వాలు తరచూ కొత్త కొత్త ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావడం ఉపాధ్యాయ సంఘాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. మాడల్ స్కూళ్లలో 5వ తరగతిని ప్రవేశపెడతామని గతంలో ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. కొంతకాలం క్రితం వీటిని తెలంగాణ పబ్లిక్ స్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేస్తామని ప్రకటించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనాలు కూడా చేశారు. అనంతరం ఇదే స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్ ప్రవేశపెట్టే అంశం తెరపైకి వచ్చింది. ఇటీవల జిల్లాకు ఒకటి చొప్పున 29 మాడల్ స్కూళ్లను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అయితే మౌలిక సమస్యలను పరిష్కరించకుండా కొత్త ప్రయోగాలు చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
విద్యార్థుల సంఖ్యను పెంచడం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ముందుగా పునాది స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయుల కొరతను అధిగమించకుండా సీబీఎస్‌ఈ, పబ్లిక్ స్కూల్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వంటి పేర్లతో మార్పులు చేసినా ఫలితం ఉండదని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా ఖాళీగా ఉన్న 1,080 పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని భూతం యాకమల్లు డిమాండ్ చేస్తున్నారు.
మౌలిక వసతుల విషయంలోనూ మాడల్ స్కూళ్లు వెనుకబడి ఉన్నాయి. రాష్ట్రంలోని 194 మాడల్ స్కూళ్లలో 180 పాఠశాలల్లో మాత్రమే బాలికల కోసం హాస్టల్ సౌకర్యం ఉంది. మరో 14 పాఠశాలల్లో హాస్టళ్లు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న హాస్టళ్లలోనూ సుమారు 100 మంది విద్యార్థినులకు మాత్రమే ఆశ్రయం కల్పించే పరిస్థితి ఉందని సమాచారం. దీంతో మిగిలిన బాలికలు ప్రతిరోజూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇది విద్యార్థినుల భద్రత, హాజరు, చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే.. మాడల్ స్కూళ్ల సమస్య ఒక్క ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకే పరిమితం కాలేదు. అడ్మిషన్ల పతనం, కోర్సుల లోపాలు, హాస్టళ్ల కొరత, మౌలిక వసతుల సమస్యలు, తరచూ మారుతున్న విధానాలు.. ఇలా అనేక సమస్యలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వం తాత్కాలిక ప్రకటనలకే పరిమితం కాకుండా సమగ్ర కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. ముందుగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసి, విద్యార్థులకు అవసరమైన కోర్సులను అందుబాటులోకి తెచ్చి, హాస్టల్ సౌకర్యాలను విస్తరించి, మౌలిక వసతులను బలోపేతం చేయాలి. అప్పుడే ‘మాడల్’ అనే పేరుకు తగిన స్థాయిలో ఈ పాఠశాలలు నిలబడే అవకాశం ఉంటుంది.
