21 ఏళ్ల తర్వాత.. ‘నా కొడుకు తండ్రివి నువ్వే’ అంటూ ధర్నా

గద్వాల: తన కుమారుడు పుట్టి 21 ఏళ్లు గడిచినా తండ్రిగా అంగీకరించడం లేదంటూ ఓ మహిళ తన కుమారుడితో కలిసి ధర్నాకు దిగిన ఘటన గద్వాలలో కలకలం రేపింది. తన కుమారుడికి తండ్రి అయిన వ్యక్తి ఇప్పటికైనా అతడిని తన కొడుకుగా అంగీకరించాలని కోరుతూ కృష్ణవేణి నిరసన చేపట్టారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

కృష్ణవేణి తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నప్పటి నుంచే తనకు తెలిసిన ఓ కుటుంబం ఇంట్లో పనిమనిషిగా పనిచేసేదానినని చెప్పారు. వయసు వచ్చిన తర్వాత కూడా అదే ఇంట్లో పనిచేస్తున్న సమయంలో ఆ యజమాని కుమారుడు తనను లోబర్చుకుని గర్భవతిని చేశాడని ఆరోపించారు. విషయం బయటకు రావడంతో గర్భస్రావం చేయించేందుకు ప్రయత్నించినా అది విఫలమైందని పేర్కొన్నారు.

అనంతరం జరిగిన పరిణామాలను తన తల్లిదండ్రులకు తెలియజేసి, తనను అక్కడి నుంచి తీసుకెళ్లాలని కోరినట్లు కృష్ణవేణి తెలిపారు. ఆ తర్వాత తాను మగబిడ్డకు జన్మనిచ్చానని చెప్పారు. అప్పటి నుంచి 21 ఏళ్లుగా తన కుమారుడిని తండ్రిగా అంగీకరించాలని కోరుతున్నప్పటికీ సంబంధిత వ్యక్తి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా తన కుమారుడిని తండ్రిగా అంగీకరించి అతడి హక్కును గుర్తించాలని కృష్ణవేణి డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా తనపై దౌర్జన్యం చేయడంతో పాటు చేతబడి చేయించి చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. తనకు, తన కుమారుడికి రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ ధర్నాకు దిగారు. ఆమె చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులు విచారణ జరిపి వాస్తవాలను తేల్చాల్సి ఉంది.

You may also like...