సర్కారు భూములకు ‘సేల్’ బోర్డు!
- గురుకుల అడ్మిషన్ల పేరుతో వసూళ్లు? - August 13, 2026
- వాయిదాల పర్వంతోముగిసిన పార్లమెంటు సమావేశాలు - August 13, 2026
- ప్రభుత్వ భూములు అమ్మకాలకేనా? - August 13, 2026

భూముల విక్రయాల ద్వారా భారీగా ఆదాయం సమీకరించడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) మరోసారి మెగా ఈ-వేలానికి సిద్ధమైంది. నగరంలో ప్రభుత్వ భూములకు పెరుగుతున్న డిమాండ్, గత వేలాల్లో నమోదైన రికార్డు ధరలను దృష్టిలో పెట్టుకుని విలువైన భూములను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. మొత్తం భూ విక్రయాల ద్వారా సుమారు రూ.3 వేల కోట్ల ఆదాయం సమీకరించాలనే లక్ష్యంతో ఈసారి పలు ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లు, ల్యాండ్ పార్సెల్స్‌ను వేలం వేయనుంది. జేబీఎస్–శామీర్‌పేట్, జేబీఎస్–డెయిరీఫామ్ ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల సమీకరణలో భాగంగానే భూముల విక్రయ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ముఖ్యంగా కోకాపేట్‌లోని నియోపొలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లలో ఉన్న అత్యంత విలువైన భూములపై ఈసారి అందరి దృష్టి నెలకొంది. ఇటీవలి వేలాల్లో కోకాపేట్ భూములకు భారీ ధరలు పలకడంతో హెచ్‌ఎండీఏ ఈసారి మరింత భారీ ఆదాయాన్ని ఆశిస్తోంది. గత డిసెంబర్‌లో జరిగిన నియోపొలిస్ భూముల వేలంలో ఎకరానికి రూ.131 కోట్ల వరకు ధర పలికినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో భూమికి రూ.118 కోట్ల వరకు ధర లభించింది. ఆ వేలం ద్వారా హెచ్‌ఎండీఏకు సుమారు రూ.వెయ్యి కోట్ల ఆదాయం సమకూరినట్లు సమాచారం. గతంలో వివిధ దశల్లో నిర్వహించిన వేలాల ద్వారా దాదాపు రూ.3,708 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
నియోపొలిస్ లేఅవుట్‌లోని 239, 240 సర్వే నంబర్ల పరిధిలో ఉన్న 4.59 ఎకరాల భూమికి ఎకరానికి రూ.120 కోట్ల కనీస ధరను నిర్ణయించారు. అలాగే గోల్డెన్ మైల్ లేఅవుట్‌లోని 0.70 ఎకరాల స్థలానికి ఎకరానికి రూ.70 కోట్ల అప్‌సెట్ ధర ఖరారు చేశారు. ఈ భూములపై పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రీబిడ్డింగ్ సమావేశాలు నిర్వహించిన అనంతరం సెప్టెంబర్ 9న ఆన్‌లైన్ బిడ్డింగ్ జరగనుంది. బిడ్డింగ్‌లో పాల్గొనే ఆసక్తిగల సంస్థలు, వ్యక్తులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కోకాపేట్‌తో పాటు నగర శివారు ప్రాంతాల్లోని పలు లేఅవుట్లను కూడా హెచ్‌ఎండీఏ వేలం జాబితాలో చేర్చింది. మోకిలాలో ఏకంగా 35 రెసిడెన్షియల్ ప్లాట్లను విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ ప్లాట్ల విస్తీర్ణం సుమారు 300 చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల వరకు ఉంది. గతంలో మోకిలా ప్రాంతంలో గజానికి రూ.లక్షకు పైగా ధర పలికిన సందర్భాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కూడా భారీ డిమాండ్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుత వేలానికి గజానికి రూ.55 వేల కనీస ధరగా నిర్ణయించారు. సెప్టెంబర్ 2న వేలం నిర్వహించనుండగా, ముందుగా ప్రీబిడ్డింగ్ సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
బాచుపల్లిలోనూ 35 ప్లాట్లను మరోసారి వేలం వేయనున్నారు. గతంలో నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు ఆశించిన స్పందన రాకపోవడంతో హెచ్‌ఎండీఏ మళ్లీ ఈ స్థలాలను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఇక్కడ 266 చదరపు గజాల నుంచి 499 చదరపు గజాల వరకు ప్లాట్లు ఉన్నాయి. ఒక్కో గజానికి రూ.45 వేల కనీస ధర నిర్ణయించారు. మోకిలా, బాచుపల్లి ప్లాట్లకు ఒకే రోజు బిడ్డింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సూరారం ప్రాంతంలోని రెండు కీలక ల్యాండ్ పార్సెల్స్ కూడా వేలం జాబితాలో ఉన్నాయి. 2,420 చదరపు గజాల స్థలానికి గజానికి రూ.75 వేల అప్‌సెట్ ధర, 4,840 చదరపు గజాల మరో స్థలానికి గజానికి రూ.55 వేల కనీస ధర నిర్ణయించారు. వాణిజ్యపరమైన అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఈ భూములకు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి పోటీ ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు, ఫరూక్‌నగర్ మండలాల్లోని ఇన్ముల్‌నర్వా హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లో 60 ప్లాట్లను కూడా విక్రయించనున్నారు. మధ్యతరగతి, సాధారణ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండేలా గజానికి రూ.15 వేల కనీస ధరను నిర్ణయించారు. ఈ ప్లాట్ల విస్తీర్ణం 152 గజాల నుంచి 300 గజాల వరకు ఉంది. సెప్టెంబర్ 3న వేలం నిర్వహించనున్నారు.
సరూర్‌నగర్‌లోని 4,355 చదరపు గజాల స్థలానికి గజానికి రూ.1.50 లక్షల కనీస ధరను నిర్ణయించారు. సెప్టెంబర్ 7న జరిగే బిడ్డింగ్‌పై వాణిజ్య, నిర్మాణ రంగాల నుంచి ఆసక్తి నెలకొంది. హైదర్‌నగర్‌లోని 3,454 చదరపు గజాల స్థలానికి గజానికి రూ.95 వేల ప్రారంభ ధర ఖరారైంది. వీటితో పాటు బైరాగిగూడ, చందానగర్, నార్సింగి, కాప్రా, అమీన్‌పూర్, సూరారం తదితర ప్రాంతాల్లోని ల్యాండ్ పార్సెల్స్‌ను కూడా వేలం ద్వారా విక్రయించనున్నారు.
ఒకవైపు భారీ విలువైన భూములను విక్రయించి ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకోవడం హెచ్‌ఎండీఏకు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. మరోవైపు నగర శివార్లలోని ప్లాట్లను మార్కెట్‌లోకి తీసుకురావడం ద్వారా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉంది. అయితే భూముల ధరలు ఇప్పటికే గణనీయంగా పెరిగిన నేపథ్యంలో వేలాల్లో తుది ధరలు ఎంతవరకు పెరుగుతాయన్నది ఆసక్తికరంగా మారింది. వేలం ప్రక్రియ పూర్తయిన తర్వాత హెచ్‌ఎండీఏ నిర్దేశించిన రూ.3 వేల కోట్ల ఆదాయ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో తేలనుంది.
