రికార్డులు పరిశీలించాకే భూముల సర్వే

  • తుమ్మలూరు 49, 50 సర్వే నంబర్ల భూ యజమానుల విజ్ఞప్తి

జ్ఞాన తెలంగాణ మహేశ్వరం ప్రతినిధి,ఆగస్టు 12: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 49, 50లోని భూముల విషయంలో రికార్డులు, కోర్టు ఉత్తర్వులను పరిశీలించిన తర్వాతే సర్వే చేపట్టాలని పట్టాదారులు ప్రసాద్‌రాజు, సురేష్‌రెడ్డి, రామచంద్రబాబు, హరిబాబులు కోరారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రెవెన్యూ సర్వే అధికారులు భూముల సర్వే కి వచ్చారని తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తమ భూములకు సంబంధించిన సర్వే ప్రక్రియపై ముందస్తు సమాచారం (నోటీసులు) ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వచ్చారని భూ పట్టాదారులు తెలిపారు. సర్వే నంబర్లు 49, 50కు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, భూముల హద్దులు, హక్కులను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని కోరారు. సర్వే నంబర్ 55కు చెందిన కుందూరు సంతోష్‌రెడ్డి తమ భూమిలో కూడా తనకు భూమి ఉందని చెబుతున్నారని, ఈ విషయమై పై పోలీసు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.సర్వే నంబర్లు 49, 50లోని భూములను తాము గత 15 ఏళ్లుగా అనుభవిస్తున్నామని పేర్కొన్నారు.సర్వే నంబర్ 55కు సంబంధించి 2023లో హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చినట్లు పట్టాదారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సంబంధిత కోర్టు ఉత్తర్వులు, రెవెన్యూ రికార్డులు, భూములకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన తర్వాతే సర్వే ప్రక్రియపై అధికారులు ముందుకు వెళ్లాలని కోరారు.భూములకు సంబంధించి ఎవరికైనా హక్కులు లేదా అభ్యంతరాలు ఉంటే సంబంధిత పత్రాలతో న్యాయపరంగా పరిష్కరించుకోవాలని పట్టాదారులు అన్నారు.అధికారుల ద్వారా పరస్పరం ఇబ్బందులు కలగకుండా చట్టపరమైన మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.తమ భూముల విషయంలో రెవెన్యూ అధికారులు రికార్డుల ఆధారంగా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

You may also like...