చేవెళ్ల బీసీ హాస్టల్‌లో అన్నంలో పురుగులు

జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:
చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని బీసీ సంక్షేమ హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న భోజనంలో పురుగులు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) నాయకులు హాస్టల్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బేగరి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు తింటున్న అన్నంలో పురుగులు కనిపించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంపై హాస్టల్ కుక్‌ను ప్రశ్నించగా, ప్రతిరోజూ ఇలాగే పురుగులు వస్తున్నాయని, పై స్థాయి నుంచి సరఫరా అవుతున్న బియ్యమే పురుగులతో వస్తోందని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు.
బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పేద విద్యార్థులు చదువుతున్న హాస్టళ్లకు నాసిరకం బియ్యం సరఫరా అవుతోందని ఆరోపించారు. నాణ్యతలేని బియ్యాన్ని సరఫరా చేస్తున్న రేషన్ డీలర్ లైసెన్స్‌ను వెంటనే రద్దు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హాస్టల్‌లో నాసిరకం బియ్యంతో పాటు పాడైపోయిన కూరగాయలతో విద్యార్థులకు భోజనం వండుతున్నారని ఆరోపిస్తూ, ఇది విద్యార్థుల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెట్టే చర్య అని అన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కానీ ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.
జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని, నాసిరకం ఆహార సరఫరాపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ చేవెళ్ల మండల కార్యదర్శి మాల చందు, నాయకులు అశోక్, హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...