చేనేతను కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టింది : కేటీఆర్


జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో:
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన చేనేత రంగం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఆయన, చేనేత కార్మికుల దుస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను నిలిపివేయడం వల్ల వేలాది నేతన్నల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేనేత కార్మికులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపిస్తూ, వెంటనే అన్ని సంక్షేమ పథకాలను పునరుద్ధరించి నేతన్నలకు భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
జాతీయ చేనేత దినోత్సవాన్ని కేవలం ఉత్సవాలకే పరిమితం చేయకుండా, చేనేత కుటుంబాల జీవనోపాధిని బలోపేతం చేసే కార్యాచరణను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత కార్మికులు తెలంగాణ ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సంక్షేమాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. చేనేత రంగాన్ని ఆదుకునే బదులు సంక్షేమ పథకాలను నిలిపివేసి కార్మికులను ఆర్థికంగా బలహీనపరిచారని ఆరోపించారు. నేతన్నల సంక్షేమంపై మాటలు కాకుండా చేతల్లో చూపాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికుల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 55,072 మంది చేనేత కార్మికులకు రూ.5 లక్షల జీవిత బీమా కల్పిస్తూ ‘నేతన్న బీమా’ పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ఈ బీమా పథకానికి అవసరమైన ప్రీమియం మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించిందని వివరించారు. అలాగే ‘నేతన్నకు చేయూత’ పథకం ద్వారా చేనేత కార్మికుల పొదుపును ప్రోత్సహిస్తూ కార్మికుడు ప్రతి నెలా రూ.1,200, అనుబంధ కార్మికుడు రూ.800 చెల్లిస్తే ప్రభుత్వం రూ.4 వేల వరకు తన వాటాను జమ చేసే వినూత్న పథకాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. ఈ పథకాలు చేనేత కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పించాయని, ప్రస్తుతం అవి నిలిచిపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.
అదేవిధంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో చేనేత సహకార సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, 20 శాతం మార్కెటింగ్ రిబేట్ అందించడంతో పాటు బతుకమ్మ చీరలు, ప్రభుత్వ పాఠశాలల యూనిఫారాల తయారీ వంటి భారీ ప్రభుత్వ ఆర్డర్లను చేనేత రంగానికే కేటాయించడం ద్వారా వేలాది కుటుంబాలకు నిరంతర ఉపాధి కల్పించామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ పథకాలు నిలిచిపోయాయని, చేనేత సహకార సంఘాలకు రావాల్సిన రాయితీలు నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వ ఆర్డర్లలో నేతన్నలకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను తగ్గించి, ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు కల్పిస్తున్నారని విమర్శించారు. దీంతో చేనేత కార్మికుల ఉపాధి అవకాశాలు తగ్గిపోయి రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని ఆరోపించారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన చేనేత భరోసా కింద ప్రతి ఏడాది రూ.18 వేల ఆర్థిక సాయం, అనుబంధ కార్మికులకు రూ.6 వేల సహాయం, లక్ష రూపాయల వరకు వ్యక్తిగత రుణమాఫీ, చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాల మాఫీ, కేంద్రం విధిస్తున్న 5 శాతం జీఎస్టీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందన్న హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నేతన్నలను మోసం చేశారని ఆరోపించారు. చేనేత రంగాన్ని ఆదుకోవాలంటే నిలిచిపోయిన అన్ని సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించి, ఎన్నికల హామీలను కాలపరిమితితో అమలు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల కష్టాలు రాజకీయాలకు అతీతమని, వారి సంక్షేమాన్ని విస్మరించడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేసినట్టేనని కేటీఆర్ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

You may also like...