అటవీ విద్యకు ప్రవేశాల నోటిఫికేషన్

అటవీ విద్యకు ప్రవేశాల నోటిఫికేషన్


– బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
– జూలై 25 వరకు దరఖాస్తుల స్వీకరణ
– టీజీ ఈఏపీసెట్–2026 అర్హత తప్పనిసరి
– ఆధునిక సదుపాయాలతో ములుగు అటవీ కళాశాల
– ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మెరుగైన ఉపాధి అవకాశాలు


ములుగు, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): అటవీ శాస్త్ర విద్యలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ)లో 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు జూలై 25లోగా దరఖాస్తు చేసుకోవాలని కళాశాల యాజమాన్యం సూచించింది.

ఈ కోర్సులో మొత్తం 45 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియట్‌లో బైపీసీ, ఎంబైపీసీ లేదా ఎంపీసీ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించి, టీజీ ఈఏపీసెట్–2026లో అర్హత పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అటవీ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ, వన్యప్రాణి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ఆగ్రో ఫారెస్ట్రీ, వాతావరణ మార్పుల అధ్యయనం వంటి ఆధునిక అంశాలను ఈ కోర్సులో బోధించనున్నారు.

తెలంగాణలో తొలి అటవీ కళాశాలగా గుర్తింపు పొందిన ఈ సంస్థ 2016లో ప్రారంభమైంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ములుగులో 52 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.72 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక క్యాంపస్‌లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆధునిక తరగతి గదులు, సాంకేతిక ప్రయోగశాలలు, వసతిగృహాలు, పరిశోధన సదుపాయాలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి.

విద్యార్థులకు దేశంలోని ప్రముఖ అటవీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి శిక్షణ, నర్సరీ నిర్వహణ, తేనెటీగల పెంపకం, ప్రాక్టికల్ ఫీల్డ్ ట్రైనింగ్ వంటి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఈ సంస్థ నుంచి 587 మంది విద్యార్థులు అటవీ విద్యను పూర్తిచేయగా, వారిలో 348 మంది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం ఈ సంస్థ ప్రతిష్ఠకు నిదర్శనంగా నిలుస్తోంది. బీఎస్సీతో పాటు ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం కళాశాల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని యాజమాన్యం సూచించింది.

You may also like...