మూడు నోటీసులు.. అయినా కదలని అధికారులు!

జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి, కొండాపూర్, సెప్టెంబర్ 27:

కొండాపూర్ మండలం మన్సాన్పల్లి గ్రామ శివారులో కొనసాగుతున్న వెంచర్ పనులపై స్థానికుల ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయంటూ సంబంధిత పంచాయతీ అధికారులు ఇప్పటికే మూడు నోటీసులు జారీ చేసినప్పటికీ.. తదుపరి చర్యలు ఎందుకు ముందుకు సాగడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో అధికారులు–వెంచర్ నిర్వాహకుల మధ్య ఏదైనా అవగాహన ఉందా? అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

మూడు నోటీసులు.. మరి చర్యలెక్కడ?

మన్సాన్పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 36, 37, 40, 41, 42, 43, 44, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 80, 81, 82, 83, 84, 85, 86లో వెంచర్ పనులు కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయనే అంశంపై ఇప్పటికే మూడు నోటీసులు ఇచ్చినట్లు చెబుతున్నప్పటికీ, పనులు పూర్తిగా ఆగకపోవడంపై వారు ప్రశ్నిస్తున్నారు. నోటీసులకే పరిమితమా? లేక తదుపరి చర్యలు ఎప్పుడు? అని నిలదీస్తున్నారు.

అధికారులు.. నిర్వాహకులు తొత్తులో ఉన్నారా?

చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారనే అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. జిల్లా పంచాయతీ అధికారి స్థాయిలో జోక్యం జరుగుతోందనే ఆరోపణలు కూడా స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. అయినప్పటికీ మూడు నోటీసుల తర్వాత కూడా చర్యలు ఎందుకు కనిపించడం లేదు? అధికారులు నిర్వాహకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలకు జిల్లా అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

కాలువలు.. వాగుల పరిస్థితి ఏంటి?

వెంచర్ పనుల కారణంగా సహజ నీటి ప్రవాహ మార్గాలైన కాలువలు, నాళాలు, వాగులపై ప్రభావం పడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల సమయంలో చూపిన నీటి ప్రవాహ మార్గాలు ప్రస్తుతం కూడా యథాతథంగా ఉన్నాయా? పనుల వల్ల వాటి దిశ మారిందా? అనే అంశాలపై ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వంద ఎకరాల్లో చెట్ల తొలగింపు?

వెంచర్ పరిధిలో సుమారు వంద ఎకరాల్లో చెట్ల తొలగింపు జరిగిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. చెట్ల తొలగింపునకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? నిబంధనల ప్రకారమే తొలగింపు జరిగిందా? అనే అంశాలపై అటవీ శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

కలెక్టర్ జోక్యంతోనే నిజాలు వెలుగులోకి?

పంచాయతీ, ఇరిగేషన్, అటవీ శాఖల అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి వెంచర్‌కు సంబంధించిన అనుమతులు, నిర్మాణాలు, నీటి ప్రవాహ మార్గాలు, చెట్ల తొలగింపు తదితర అంశాలను పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. మూడు నోటీసుల తర్వాత కూడా చర్యలు ఎందుకు నిలిచిపోయాయో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.1405801.jpg

You may also like...