సెలైన్ చేతికే… సేవ మాత్రం ఆగలేదు!

Screenshot_2026-09-24-21-02-19-01_7ff963d6157eed07ba361fc406474d27.jpg

బాన్సువాడ :తాను పేషెంట్‌గా మారినా.. రోగుల సేవలోనే డాక్టర్ శ్రీను నాయక్

వృత్తి ధర్మానికి అంకితభావం.. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం,

వైద్యుడిని దైవంతో సమానంగా ఎందుకు చూస్తారో నిరూపించే మానవీయ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ తన విధులకు సెలవు పెట్టకుండా, ఒక చేతికి సెలైన్ ఎక్కించుకుంటూనే మరోవైపు రోగులకు వైద్య సేవలు అందించిన డాక్టర్ శ్రీను నాయక్ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి ప్రతిరోజూ చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు చికిత్స కోసం వస్తుంటారు. ముఖ్యంగా అత్యవసర విభాగంలో నిరంతరం రోగుల తాకిడి ఉంటుంది. ఈ క్రమంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీను నాయక్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నిలబడటమే కష్టంగా ఉన్నప్పటికీ, తాను విధులకు గైర్హాజరైతే రోగులు ఇబ్బందులు పడతారని భావించి ఆసుపత్రిలోనే ఉండి సేవలు కొనసాగించారు.ఒక చేతికి సెలైన్ బాటిల్ ఎక్కించుకుని, మరో చేత్తో రోగులను పరీక్షిస్తూ అవసరమైన మందులు, చికిత్స అందించారు. తానే ఒకవైపు పేషెంట్‌గా చికిత్స పొందుతూ.. మరోవైపు వైద్యుడిగా రోగులకు అండగా నిలవడం చూసిన పేషెంట్లు, వారి బంధువులు భావోద్వేగానికి గురయ్యారు.“ఇలాంటి వైద్యుల వల్లే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరుగుతోంది” అంటూ పలువురు డాక్టర్ శ్రీను నాయక్‌ను అభినందించారు. ఆయన సేవలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో జిల్లా ప్రజలు, తోటి వైద్య సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు.శభాష్ డాక్టర్ శ్రీను నాయక్.. వృత్తి ధర్మానికి మీ అంకితభావం అభినందనీయం!

You may also like...