జిహెచ్ఎంసి నీ సందర్శించిన థాయిలాండ్ బృందం

హైదరాబాద్, నవంబర్ 12: పట్టణ పాలనలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పౌరులకు మెరుగైన సేవలు అందించడంలో జీహెచ్‌ఎంసీ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేసేందుకు థాయ్‌లాండ్‌కు చెందిన ప్రతినిధుల బృందం నవంబర్ 11న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కార్యాలయాన్ని సందర్శించింది.
థాయ్ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతకు సలహాదారుగా పనిచేస్తున్న పెంగ్‌పనోర్ బూన్‌క్లమ్, ప్రోగ్రెసివ్ మూవ్‌మెంట్ ఫౌండేషన్ చైర్మన్ తనథోర్న్ జువాంగ్‌రూంగ్‌కిట్, ఫౌండేషన్ డైరెక్టర్ కుంతిడా రుంగ్రూంగ్‌కియాట్, సాయిరామ్ ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు.
ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ డిజిటల్ పాలన కార్యక్రమాలపై అధికారులు ప్రతినిధులకు వివరించారు. ముఖ్యంగా భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్ ఆమోదాలు, ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) సేవలను ఒకే వేదికపై అందించే బిల్డ్‌నౌ (BuildNow) యాప్ పనితీరును వివరించారు.
ఈ యాప్ ద్వారా వివిధ అనుమతుల ప్రక్రియను ఏకీకృతం చేసి, దరఖాస్తుల పరిష్కారంలో పారదర్శకత, వేగం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రజలకు, నిర్మాణ రంగానికి సంబంధించిన వారికి సులభంగా సేవలు అందించడమే లక్ష్యమని అధికారులు వివరించారు.
జీహెచ్‌ఎంసీ అనుసరిస్తున్న సాంకేతిక ఆధారిత పట్టణ పరిపాలన విధానాలు, ప్రజలకు కేంద్రంగా రూపొందించిన డిజిటల్ సేవలను థాయ్‌లాండ్ ప్రతినిధుల బృందం అభినందించింది. అంతర్జాతీయ స్థాయిలో పట్టణ పాలనలో ఉత్తమ విధానాలను పరస్పరం పంచుకోవడం, అనుభవాలను మార్పిడి చేసుకోవడం ద్వారా పరిపాలనా వ్యవస్థలను మరింత మెరుగుపరచుకోవచ్చని ఈ సమావేశం ద్వారా వెల్లడైంది.
ఈ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారులు పి. ఉదయ్ కుమార్, రాధిక గుప్తా నాయకత్వం వహించారు. జీహెచ్‌ఎంసీ డిజిటల్ గవర్నెన్స్ కార్యక్రమాలు, పరిపాలనా ఉత్తమ విధానాలపై వారు ప్రతినిధి బృందానికి వివరించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో పట్టణ సేవలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు చేరువ చేయడంలో జీహెచ్‌ఎంసీ చేపడుతున్న చర్యలు ఈ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

You may also like...