బెట్టింగ్‌ యాప్స్‌ ముసుగులో చైనా దందా!

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల ముసుగులో భారీ అంతర్జాతీయ ఆర్థిక అక్రమాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గత మూడేళ్లలో భారత్‌ నుంచి చైనాకు సుమారు రూ.2,700 కోట్ల నగదు బదిలీ అయినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన మూడు కంపెనీలకు సుమారు రూ.270 కోట్ల మేర కమిషన్‌ అందినట్లు ప్రాథమికంగా వెల్లడైంది. చైనాకు చెందిన బెట్టింగ్‌ యాప్‌ల కార్యకలాపాలకు హైదరాబాద్‌లోని కొన్ని కంపెనీలు సాంకేతిక వేదికలుగా, మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ యాప్‌ల ద్వారా వినియోగదారుల నుంచి యూపీఐ చెల్లింపుల రూపంలో భారీగా నగదు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆ మొత్తాన్ని వివిధ ఖాతాల ద్వారా మళ్లించి, క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు తరలిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో నగదు ప్రవాహం, మధ్యవర్తుల పాత్ర, కంపెనీల ఆర్థిక లావాదేవీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జాతీయ స్థాయిలో ఈ అక్రమ లావాదేవీల గుట్టు తేల్చేందుకు దిల్లీ ఐటీ శాఖ విచారణ చేపట్టింది. ముఖ్యంగా గుజరాత్‌లోని కొన్ని ప్రైవేటు బ్యాంకుల ద్వారా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించడంతో ఆయా బ్యాంకు ఖాతాలు, లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ కంపెనీలకు అందినట్లు చెబుతున్న భారీ కమిషన్ల వెనుక ఎవరున్నారు? ఈ నెట్‌వర్క్‌లో మరెన్ని సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి? విదేశాలకు తరలిన నగదులో ఎంత మొత్తం బెట్టింగ్‌ ద్వారా సమకూరింది? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పేరుతో సాగుతున్న ఈ అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారం వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి అక్రమ నగదు బదిలీ మార్గాలను వెలికితీయడం దర్యాప్తు సంస్థలకు కీలకంగా మారింది. అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలపై అధికారిక విచారణ ఫలితాలు వెలువడాల్సి ఉంది.

You may also like...