వామ్మో.. అందం భయం!

అందం విషయంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇద్దరు భారతీయ తారలు సుస్మితా సేన్‌, ఐశ్వర్య రాయ్‌. అయితే ఒకప్పుడు ఐశ్వర్య అందానికి భయపడి సుస్మిత సేన్‌ మిస్‌ ఇండియా పోటీల నుంచి తప్పుకోవాలని అనుకున్నారంటే నమ్మగలరా? ఈ ఆసక్తికరమైన విషయాన్ని సుస్మిత గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ సంఘటన మరోసారి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొనేందుకు సుస్మిత దరఖాస్తు చేసుకునే సమయంలో ఐశ్వర్య రాయ్‌ కూడా పోటీలో ఉన్నట్లు తెలిసింది. అప్పటికే ఐశ్వర్య అందానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఆమె అందం గురించి అందరూ మాట్లాడుకోవడంతో సుస్మితలో ఆందోళన మొదలైంది. దీనికి తోడు ఐశ్వర్య పోటీలో ఉందని తెలిసి సుమారు 25 మంది యువతులు తమ దరఖాస్తులను వెనక్కి తీసుకున్నారని నిర్వాహకుల ద్వారా తెలుసుకున్నారు. దీంతో సుస్మిత కూడా పోటీలో కొనసాగడం కష్టమేనని భావించారు. ఐశ్వర్యతో పోటీపడటం సాధ్యం కాదని అనుకుని పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇంటికి వెళ్లిన సుస్మిత తన మనసులోని మాటను తల్లికి చెప్పారు. అయితే కూతురు తీసుకున్న నిర్ణయం ఆమె తల్లికి ఏమాత్రం నచ్చలేదు. ప్రయత్నం చేయకుండానే ఓటమిని అంగీకరించడం ఎందుకని ప్రశ్నించారు. ‘‘ఆమె ప్రపంచంలోనే అత్యంత అందమైన అమ్మాయి అని నీకు అనిపిస్తే, ఆమెతోనే పోటీపడు. ఓడిపోతే ఆమె చేతిలోనే ఓడిపో.. అంతేకానీ పోటీ నుంచి పారిపోవద్దు. నీ శక్తిమేర ప్రయత్నించు’’ అంటూ గట్టిగా మందలించారు. తల్లి చెప్పిన ఈ మాటలు సుస్మితలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.

ఆ ప్రోత్సాహంతో సుస్మిత పోటీలో కొనసాగారు. చివరకు మిస్‌ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్కడితో ఆగకుండా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో పాల్గొని 1994లో విజేతగా నిలిచారు. తద్వారా భారత్‌కు తొలి మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని అందించి చరిత్ర సృష్టించారు. ఇదే ఏడాది ఐశ్వర్య రాయ్‌ మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఒకే ఏడాది ఇద్దరు భారతీయ అందాల తారలు రెండు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కిరీటాలను సాధించడం దేశానికి గర్వకారణంగా నిలిచింది.

ఆ తర్వాత సుస్మిత సేన్‌ సినీ రంగంలోకి అడుగుపెట్టి నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘బీవీ నెం.1’, ‘మై హూ నా’ వంటి చిత్రాలతో పాటు ‘ఆర్య’, ‘తాలీ’ వంటి వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఐశ్వర్య రాయ్‌ కూడా భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు.

You may also like...