పీఆర్‌టీ కారిడార్లు.. ఏడాదిలో తొలి దశ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

  • నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించి, వాయు కాలుష్యాన్ని నియంత్రించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. కోర్ అర్బన్ ఏరియా (క్యూర్‌) పరిధిలోని ప్రధాన మార్గాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్‌టీ) వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో పీఆర్‌టీ విధానంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తొలిదశలో అత్యంత రద్దీగా ఉండే కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్ మీదుగా బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు పీఆర్‌టీ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టుకు డిసెంబర్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, ఏడాది కాలంలో నిర్మాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. గచ్చిబౌలి ఐకియా సమీపంలో మల్టీలెవల్ పార్కింగ్‌తో పాటు పీఆర్‌టీ డిపో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా ఎల్బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా రాణిగంజ్ బస్టాండ్ వరకు రెండో కారిడార్‌ను ప్రతిపాదించారు.

అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి రవీంద్రభారతి, సచివాలయం, ఐమాక్స్ మీదుగా బేగంపేట వరకు మూడో కారిడార్ ఏర్పాటు చేయాలని సూచించారు. నెక్లెస్ రోడ్‌లో మల్టీలెవల్ పార్కింగ్, పీఆర్‌టీ డిపో నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే నగర ప్రజలకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రజా రవాణా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

You may also like...