లూజు లైన్లకు చెక్‌.. లో వోల్టేజీకి పరిష్కారం..

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 1: విద్యుత్‌ లూజు లైన్లు, తరచూ విద్యుత్‌ అంతరాయాలు, లో వోల్టేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కట్టంగూర్‌ మండల కేంద్ర ప్రజలకు ఊరట లభించింది. సమస్యను పలుమార్లు మండల పరిషత్‌ సమావేశాల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లిన స్థానిక సర్పంచ్‌ ముక్కామల శ్యామల శేఖర్ చొరవతో విద్యుత్‌ అధికారులు స్పందించారు.

గురువారం మండల కేంద్రంలో లూజు లైన్ల సవరణ పనులను చేపట్టారు. ఇందులో భాగంగా ఏడు పెద్ద విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేసి, నూతన వైర్లను గుంజారు. ప్రమాదకరంగా వేలాడుతున్న లైన్లను సరిచేసి, లో వోల్టేజీ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ ముక్కామల శ్యామల శేఖర్ మాట్లాడుతూ.. గ్రామంలో లూజు విద్యుత్‌ లైన్ల కారణంగా ప్రజలు తరచూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యుత్‌ అంతరాయాలు, లో వోల్టేజీతో గృహ వినియోగదారులతో పాటు చిన్న వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అధికారులు స్పందించి పనులు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. మిగిలిన విద్యుత్‌ సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరించేందుకు అధికారులతో సమన్వయం చేసుకుంటామని తెలిపారు. లూజు వైర్ల కారణంగా ప్రమాదాల ముప్పు కూడా ఉండేదని, ప్రస్తుతం కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి లైన్లను సరిచేయడంతో సమస్య తగ్గుతుందని స్థానికులు పేర్కొన్నారు. విద్యుత్‌ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన సర్పంచ్‌, స్పందించిన విద్యుత్‌ అధికారులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

You may also like...