ఎర్రగుట్టలో విషాదం.. గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతి
- సాయి నగర్లో భక్తిశ్రద్ధలతో గణనాథుడి పూజలు - September 19, 2026
- చౌడర్గూడలో TOSS ప్రవేశాల ప్రచారం - September 19, 2026
- హెచ్-1బీపై 1 లక్ష డాలర్ల ఫీజు కొనసాగింపు - September 19, 2026

జ్ఞాన తెలంగాణ ప్రతినిధి/జడ్చర్ల, సెప్టెంబర్ 19: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని ఎర్రగుట్ట ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం తీసిన గుంతలో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నిర్మాణ పనుల కోసం ఇంటి సమీపంలో గుంత తవ్వి ఉంచారు. ఈ గుంత చుట్టూ సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదానికి అవకాశం ఏర్పడింది. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయినట్లు తెలుస్తోంది. విషయం గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు సమాచారం. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పటివరకు ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి విగతజీవిగా మారడంతో స్థానికంగా విషాదం నెలకొంది. నిర్మాణ పనుల కోసం గుంతలు తవ్వినప్పుడు వాటి చుట్టూ రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని, చిన్నారులు, ప్రజలు ప్రమాదానికి గురికాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నిర్లక్ష్యంగా గుంతలు వదిలేయడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
