యూరియా కోసం రైతుల విలవిల
- నూతన వధూవరులను ఆశీర్వదించిన మున్సిపాలిటీ చైర్మన్ - August 26, 2026
- యూరియా కోసం రైతుల విలవిల - August 26, 2026
- పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ భరోసా.. ఎమ్మెల్యే కసిరెడ్డి - August 26, 2026

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఎరువుల యాప్ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సౌకర్యం కల్పించాల్సింది పోయి తీవ్ర ఇబ్బందులకు కారణమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా స్టాక్ వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేసిన ఐదు నుంచి పది నిమిషాల్లోనే స్టాక్ అయిపోతుండటంతో రైతులు ఖాళీ చేతులతో వెనుదిరుగుతున్నారు. యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు యాప్ నిబంధనలు మరో శాపంగా మారాయి.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, మిర్చి, కూరగాయలు తదితర పంటలు విస్తారంగా సాగవుతున్న నేపథ్యంలో యూరియాకు డిమాండ్ భారీగా ఉంది. ప్రభుత్వం వరి సాగును తగ్గించి ఆరుతడి పంటల వైపు రైతులను ప్రోత్సహించినప్పటికీ, సాగు విస్తీర్ణానికి అనుగుణంగా యూరియా అవసరం కొనసాగుతోంది. అయితే డిమాండ్‌కు తగిన స్థాయిలో సరఫరా లేకపోవడంతో రైతులు ఎరువుల కోసం డీలర్లు, వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
మరోవైపు యాప్‌లో సర్వర్ డౌన్ కావడం, ఓటీపీలు సకాలంలో రాకపోవడం, స్టాక్ కనిపించకపోవడం, స్టాక్ అయిపోయిన తర్వాత కూడా బుకింగ్‌లు నమోదవడం వంటి సాంకేతిక సమస్యలు రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. గ్రామాల వివరాలు యాప్‌లో కనిపించకపోవడం, ఫార్మర్ రిజిస్ట్రీలో సమస్యలు, ఎల్‌జీ కోడ్లు మ్యాప్ కాకపోవడం వంటి లోపాలతో కొందరు రైతులు ఇతర గ్రామాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది.
యాప్‌లో స్టాక్ కనిపించిన వెంటనే వందలాది మంది రైతులు బుకింగ్ చేసేందుకు ప్రయత్నించడంతో కొద్ది నిమిషాల్లోనే స్టాక్ ఖాళీ అవుతోంది. సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్‌ఫోన్ వినియోగంపై పూర్తి అవగాహన లేని రైతులకు ఈ విధానం మరింత భారంగా మారుతోంది. కొందరు రైతులు బుకింగ్ కోసం ఇతరుల సహాయం తీసుకోవాల్సి వస్తుండగా, అప్పటికే స్టాక్ ముగిసిపోతుండటంతో నిరాశకు గురవుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్న సమయంలో అవసరమైన యూరియా అందుబాటులో లేకపోవడం రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సరైన సమయంలో ఎరువు అందకపోతే పంటల ఎదుగుదల, దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూలలో నిలబడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పారదర్శకత కోసం తీసుకొచ్చిన యాప్ రైతులకు అడ్డంకిగా మారకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా నిల్వలను పెంచడంతో పాటు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయాలని, యాప్ సర్వర్లను పటిష్టం చేయాలని, ఓటీపీ మరియు బుకింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. రైతు పంటకు అవసరమైన సమయంలో యూరియా దక్కకపోతే ప్రభుత్వ విధానాల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

