CMR Group చల్లూరి రెసిడెన్సీపై సమగ్ర విచారణ చేపట్టాలి
- CMR Group చల్లూరి రెసిడెన్సీపై సమగ్ర విచారణ చేపట్టాలి - August 8, 2026
- చేవెళ్లలో తెలంగాణ రక్షణ సేన జోరు - August 8, 2026
- నేడు సాయంత్రం 5 గంటలకు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఘన స్వాగతానికి పిలుపు - August 8, 2026

సాహసం రాష్ట్ర అధ్యక్షులు డా. ముప్పారం ప్రకాశం
పెద్ద అంబర్పేట్, ఆగస్టు 7: పెద్ద అంబర్పేట్ మండల పరిధిలో అభివృద్ధి చేస్తున్న CMR Groupకు చెందిన చల్లూరి రెసిడెన్సీ – ప్రీమియం విల్లా & ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టుపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ భూముల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సాహసం రాష్ట్ర అధ్యక్షులు డా. ముప్పారం ప్రకాశం డిమాండ్ చేశారు. ఈ మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ (MRO)కు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా డా. ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ, వెంచర్‌కు ఆనుకుని ఉన్న ప్రభుత్వ నాలాను అక్రమంగా పూడ్చివేసి, దానిని వెంచర్లో భాగంగా చూపిస్తూ ప్లాట్లుగా మార్చి విక్రయించే ప్రయత్నం జరుగుతున్నట్లు తమకు విశ్వసనీయ సమాచారం అందిందని ఆరోపించారు. ఇటువంటి చర్యలు ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడమే కాకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని పేర్కొన్నారు. ప్రభుత్వ నాలాలు సహజ వర్షపు నీటి ప్రవాహానికి కీలకమైన మార్గాలని, వాటిని పూడ్చివేయడం వల్ల భవిష్యత్తులో భారీ వర్షాల సమయంలో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందన్నారు. వర్షపు నీరు వెళ్లే మార్గాలు మూసివేయబడితే సమీప కాలనీలు, వ్యవసాయ భూములు నీట మునిగే ప్రమాదం ఉందని, దీనివల్ల ప్రజలకు ప్రాణ, ఆస్తి నష్టం కలిగే పరిస్థితులు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే సర్వే నంబర్లు 107, 108/P, 110/P, 111, 158/P, 159/Pలలో క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. రెవెన్యూ, ఇరిగేషన్, గ్రామపంచాయతీ మరియు సంబంధిత శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలన చేసి ప్రభుత్వ నాలా అసలు విస్తీర్ణం, సరిహద్దులను నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ నాలా ఆక్రమణ జరిగినట్లు తేలితే వెంటనే ఆక్రమణలను తొలగించి నాలాను పునరుద్ధరించాలని, ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, ఇందుకు బాధ్యులపై రెవెన్యూ, క్రిమినల్ మరియు ఇతర వర్తించే చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించి మంజూరైన లేఅవుట్ అనుమతులు, నాలా కన్వర్షన్‌కు సంబంధించిన పత్రాలు, సంబంధిత శాఖల అనుమతులు, ఇతర చట్టబద్ధమైన రికార్డులను కూడా పరిశీలించాలని కోరారు. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, కుంటలు వంటి సహజ వనరులను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత అని డా. ముప్పారం ప్రకాశం అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించడం, సహజ నీటి మార్గాలను మూసివేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని తెలిపారు. అధికారులు పారదర్శకంగా విచారణ నిర్వహించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన కోరారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే సంబంధిత ఉన్నతాధికారులను, జిల్లా కలెక్టర్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించడంతో పాటు అవసరమైతే న్యాయపరమైన పోరాటం కూడా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాహసం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిలుకర రంజిత్, చింతయ్య, దేవని శేఖర్ తదితరులు పాల్గొని ప్రభుత్వ నాలాల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు.
