పెద్దిపై కక్ష రాజకీయాలు!
- ఢిల్లీలో టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం - July 29, 2026
- శంకర్‌పల్లిలో ‘మా విలేజ్ రెస్టారెంట్’ ప్రారంభం - July 29, 2026
- పెద్దిపై కక్ష రాజకీయాలు! - July 29, 2026

- పెద్ది సుదర్శన్ రెడ్డిని రాజకీయంగా టార్గెట్ చేశారని ఆరోపణ
- సెక్యూరిటీ రివ్యూ కమిటీ పేరుతో ప్రతిపక్షంపై కక్ష సాధింపు
- వెపన్ లైసెన్స్, గన్మెన్ల తొలగింపుపై తీవ్ర విమర్శలు
- భద్రత కల్పించడంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని వ్యాఖ్య
- థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్, జూలై 29: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురి చేసిందని, వెపన్ లైసెన్స్ పునరుద్ధరణను నిలిపివేయడంతో పాటు దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న భద్రతను తొలగించడం వల్లే ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు దేశ విదేశాల నిపుణులైన వైద్యులతో సంప్రదింపులు జరిపిస్తూ మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.
సెక్యూరిటీ రివ్యూ కమిటీ పేరుతో ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని భద్రతను తొలగిస్తోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన వారినే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. సివిల్ సప్లైస్ శాఖలో రూ.1100 కోట్ల అవినీతి, పాఠశాల విద్యాశాఖలో బంకర్ బెడ్ల కొనుగోళ్లలో జరిగినట్లు ఆరోపిస్తున్న భారీ కుంభకోణాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి బహిర్గతం చేసిన తర్వాతే ఆయనపై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. అవినీతి అంశాలపై డీజీపీకి ఫిర్యాదు చేయడం, విజిలెన్స్ అధికారులను ఆశ్రయించడం, హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయడం వంటి చర్యల అనంతరం ఆయన వెపన్ లైసెన్స్ పునరుద్ధరణను నిలిపివేసి, గన్మెన్లను కూడా తొలగించారని ఆరోపించారు.
పెద్ది సుదర్శన్ రెడ్డికి గత 25 ఏళ్లుగా వెపన్ లైసెన్స్ ఉండేదని, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధిగా పనిచేసిన కారణంగా దాదాపు 20 ఏళ్లుగా భద్రత కల్పించారని గుర్తు చేశారు. కోర్టు భద్రత పునరుద్ధరించాలని ఆదేశించినప్పటికీ అధికారులు అమలు చేయలేదని విమర్శించారు. వాసవి కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన భూవివాదాల నేపథ్యంలో కూడా ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చారని, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ప్రభుత్వంపై మాట్లాడకుండా ఉంటే వెపన్ లైసెన్స్ పునరుద్ధరిస్తామని, కేసులు ఉపసంహరిస్తామని ప్రతిపాదనలు వచ్చినట్లు పేర్కొన్నారు.
భద్రత కల్పించడంలో ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని డా. ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో నక్సలైట్ ముప్పు లేదని ప్రకటిస్తూనే కొందరు అధికార పార్టీ నాయకులకు 2+2 గన్మెన్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎందుకు కల్పిస్తున్నారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్కు చెందిన పలువురు మాజీ మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధుల భద్రతను తొలగించడం రాజకీయ వివక్షకు నిదర్శనమని అన్నారు.
సెక్యూరిటీ రివ్యూ కమిటీని వెంటనే రద్దు చేయాలని, భద్రత కల్పించే ప్రమాణాలకు సంబంధించిన థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్‌తో పాటు సెక్యూరిటీ ప్రోటోకాల్ “ఎల్లో బుక్”ను బహిరంగపరచాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా నిజంగా ప్రాణహాని ఉన్న ప్రతి నాయకుడికి సమాన ప్రమాణాలతో భద్రత కల్పించాలని కోరుతూ, ప్రతిపక్ష నాయకులను అణచివేసేందుకు భద్రతను రాజకీయ ఆయుధంగా ఉపయోగించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
