మతిస్థిమితం లేని వృద్ధుడి ఐదెకరాల భూమి కబ్జా?

బెదిరింపులు, కిడ్నాప్ యత్నాలపై న్యాయం కోరుతున్న కుటుంబం


దహెగాం గ్రామానికి చెందిన 67 ఏళ్ల మతిస్థిమితం లేని వృద్ధుడు దుర్గం బాపయ్యకు చెందిన ఐదెకరాల భూమిని ఓ ప్రభుత్వ ఉద్యోగి, మాజీ కౌన్సిలర్‌తో పాటు మరో వ్యక్తి అక్రమంగా కబ్జా చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ భూమిని అనంతరం రూ.75 లక్షలకు మరో వ్యక్తికి విక్రయించినట్లు వారు పేర్కొంటున్నారు. బాధిత కుటుంబ సభ్యులు వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన ప్రతిసారి చంపేస్తామని బెదిరించడం, వృద్ధుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదైనప్పటికీ, పోలీసు శాఖ మరియు రెవెన్యూ అధికారులను ఆశ్రయించినా తమకు న్యాయం జరగలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ భూకబ్జా వ్యవహారంలో స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, వృద్ధ దంపతులకు రక్షణ కల్పించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

You may also like...