అనుమతులు లేని వైద్య కేంద్రాలపై అధికారుల కొరడా

ఘనపూర్ స్టేషన్, సెప్టెంబర్ 24: ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆసుపత్రులు, క్లినిక్‌లు, మెడికల్ షాపులపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఔషధ నియంత్రణ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వాణిశ్రీ ఆధ్వర్యంలో గురువారం ఘనపూర్ స్టేషన్‌లో ఈ తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఆరు మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సాయి శ్రీ క్లినిక్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రోగ నిర్ధారణ కేంద్రం (ల్యాబ్)ను మూసివేశారు. రాజరాజేశ్వరి మెడికల్ షాప్ వెనుక భాగంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్‌ను కూడా మూసివేశారు. అలాగే జగన్ కట్ల దవాఖానలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఎక్స్‌రే యంత్రాన్ని అధికారులు సీజ్ చేసి, సేవలను నిలిపివేశారు.ఈ తనిఖీల్లో ఔషధ నియంత్రణ అడిషనల్ డైరెక్టర్ డా. రాజ్యలక్ష్మి, జిల్లా ఔషధ నియంత్రణ అధికారి ఆలే బాలకిషన్, భూపాలపల్లి జిల్లా ఔషధ నియంత్రణ అధికారి పి. పావన, వరంగల్ జిల్లా ఔషధ నియంత్రణ అధికారి యు. ఉపేందర్, ఘనపూర్ స్టేషన్ వైద్యాధికారి డా. పి. శ్రీ వాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

You may also like...