పేదల ఇళ్లపై పాలకుల పంజా.. పోరుకు సిద్ధమైన బాధితులు!
- పేదల ఇళ్లపై పాలకుల పంజా.. పోరుకు సిద్ధమైన బాధితులు! - November 9, 2026
- ఆర్ఎస్ఎస్కు సేవకులే బలం! - November 9, 2026
- జనగణనకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్! - November 9, 2026

జ్ఞాన తెలంగాణ, కాగజ్‌నగర్ ప్రతినిధి, నవంబర్ 9:
పేదల ఇళ్లపై పాలకులు పంజా విసురుతున్నారని, దశాబ్దాలుగా నివసిస్తున్న నిరుపేదలను నిరాశ్రయులను చేయాలని చూస్తే తీవ్ర ప్రజాపోరాటం తప్పదని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. సర్ సిల్క్ కంపెనీ భూముల్లో ఐదు దశాబ్దాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు తొలగింపు నోటీసులు జారీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 4,800 కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతంలో 3 వేల కుటుంబాలకు నోటీసులు అందించారని ఆరోపించారు. పేదల గూళ్లను కూల్చి వారి జీవితాలను వీధిపాలు చేయాలనుకోవడం అమానుషమని మండిపడ్డారు.

సోమవారం కాగజ్‌నగర్‌లోని ప్రాణహిత నిలయం వద్ద సర్ సిల్క్ భూ బాధితులతో సమావేశమైన ఆయన, అనంతరం వందలాది మందితో కలిసి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. ఆధార్, రేషన్, ఓటరు గుర్తింపు కార్డులు, విద్యుత్ బిల్లులు, ఇంటి నంబర్లతో దశాబ్దాలుగా నివసిస్తున్న కుటుంబాలను ఒక్కసారిగా ఖాళీ చేయమనడం ఏ విధమైన న్యాయమని ప్రశ్నించారు. బాధితులకు అండగా నిలవాల్సిన స్థానిక బీజేపీ ఎమ్మెల్యే హరీష్‌బాబు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ దండె విఠల్ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను కాపాడలేని ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

సర్ సిల్క్ కంపెనీలో పనిచేసిన కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీ సుమారు రూ.5 లక్షలు కాగా, కేవలం రూ.40 వేలు మాత్రమే చెల్లించారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. కార్మికులకు న్యాయం జరిగేలా రూ.కోటి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కంపెనీ లిక్విడేటర్‌కు ప్రభుత్వమే అవసరమైన మొత్తం చెల్లించి, భూములను అర్హులైన పేద కుటుంబాలకు కేటాయించాలని కోరారు. సిర్పూర్ పేపర్ మిల్ తరహాలో సర్ సిల్క్ బాధితులకు కూడా న్యాయం చేయాలని సూచించారు.
లగచర్ల, వెలుగుమట్ల భూ వివాదాలు, హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలను ప్రస్తావిస్తూ పేదల భూములపైనే ప్రభుత్వ ప్రతాపం ఎందుకని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ నివాసాలు కల్పించకుండా బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేందుకు ప్రయత్నిస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పేదల గూళ్లను కాపాడేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమని ప్రకటించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మిన్హాజ్, కొంగ సత్యనారాయణ, గోలెం వెంకటేష్, కౌన్సిలర్ పోచయ్య, మండల అధ్యక్షుడు అంజన్న, నక్క మనోహర్, సలీం, షాకీర్, సారయ్య, లహెంచు తదితరులు పాల్గొన్నారు.

