జిల్లాలకే వైద్యం.. సర్కార్‌ కీలక నిర్ణయం!

రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి వైద్య సేవలను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పునర్వ్యవస్థీకరణపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలో డీసీహెచ్‌ఎస్‌ (జిల్లా కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌) కార్యాలయాల ఏర్పాటు, ఆసుపత్రుల అభివృద్ధి, వైద్య సిబ్బంది నియామకాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు వారి జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. చిన్నచిన్న అనారోగ్య సమస్యల నుంచి అత్యవసర వైద్య సేవల వరకు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితిని తొలగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు వైద్య సేవల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,616 మంది స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకాలతోపాటు అవసరమైన నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఇతర సాంకేతిక సిబ్బంది నియామకాలు కూడా చేపట్టినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఆసుపత్రుల పడకల సామర్థ్యాన్ని బట్టి వైద్య సేవల ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా 30, 50, 100 పడకల ఆసుపత్రులకు వేర్వేరుగా వైద్య సేవల విధానాన్ని ఖరారు చేయాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలో అవసరమైన స్పెషలిస్ట్‌ వైద్యులు, ఆధునిక వైద్య పరికరాలు, రోగ నిర్ధారణ పరీక్షల సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ (ఐపీహెచ్‌ఎస్‌) ప్రమాణాలకు అనుగుణంగా ఆసుపత్రులను తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. కేవలం భవనాలు, పడకల సంఖ్య పెంచడమే కాకుండా రోగులకు అందే వైద్య సేవల నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆసుపత్రుల పనితీరుపై బాధ్యతాయుతమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జిల్లాస్థాయిలోనే మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తే పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయాణ ఖర్చులు, సమయం ఆదా అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. వైద్య విధాన పరిషత్‌ పునర్వ్యవస్థీకరణతో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపడి, సామాన్యులకు నాణ్యమైన వైద్యం చేరువ కావాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆకాంక్షించారు.

You may also like...