ఆజాద్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలి:ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం జనగామలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం, జనగామ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విద్య ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమనే లక్ష్యంతో దేశ విద్యారంగానికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. ముస్లిం యువతను స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపించడంతో పాటు తన రచనలు, పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు.హిందూ, ముస్లింల మధ్య ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ జాతీయ సమైక్యత కోసం నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా సుమారు 11 ఏళ్లపాటు సేవలందించి విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి జాతీయ నాయకులతో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో కీలక బాధ్యతలు నిర్వహించారని పేర్కొన్నారు.ఆజాద్ ఆశయాలు, దేశ సమైక్యత, విద్యాభివృద్ధి పట్ల ఆయన చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, వాటిని ఆచరణలో పెట్టడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.WhatsApp Image 2026-11-11 at 21.11.07.jpeg

You may also like...