విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడిన కలెక్టర్.. ఘనంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

WhatsApp Image 2026-11-11 at 21.09.06.jpeg

చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలి: కలెక్టర్ సందీప్ కుమార్ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తూ కనీసం ఒక క్రీడలోనైనా నైపుణ్యం సాధించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.జనగామ మండలం పెంబర్తిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అండర్‌-14, అండర్‌-17, అండర్‌-19 విభాగాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను బుధవారం కలెక్టర్ ఘనంగా ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలకు శ్రీకారం చుట్టారు. అనంతరం మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.వివిధ పాఠశాలల విద్యార్థుల మార్చ్‌పాస్ట్, ఒలింపిక్ టార్చ్ రిలే, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తరగతి గది విద్యార్థులకు ఎలా ఆలోచించాలో నేర్పితే, ఆటస్థలం ఎలా జీవించాలో నేర్పుతుందని పేర్కొన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించడం ఓటమి ఎదురైనా తిరిగి ప్రయత్నించడం క్రీడల ద్వారా అలవడుతాయని తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు చెస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడల్లో ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.అనంతరం వాలీబాల్ పోటీలను ప్రారంభించిన కలెక్టర్ స్వయంగా మైదానంలోకి దిగి విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడారు. కలెక్టర్ తమతో కలిసి ఆడటంతో విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాలని ఆయన ఆకాంక్షించారు.కార్యక్రమంలో ఈసీఓ శ్రవణ్, డీసీఓ శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, పాఠశాల ప్రిన్సిపాల్ విజయజ్యోతి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

You may also like...