ముళ్లపొదల్లో ముప్పు.. ఇళ్ల మధ్య విషసర్పాల సంచారం!
- మోదీతో సీడబ్ల్యూజీ విజేతల భేటీ - August 9, 2026
- విద్యార్థులపై దాడిపై అమిత్ షా మౌనం ఎందుకు? - August 9, 2026
- భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మారుస్తాం - August 9, 2026
దోమలు, పాములకు ఆవాసాలుగా మారిన ఖాళీ ప్లాట్లు..
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, ఆగస్టు 9 : ఇల్లు కట్టుకుందామని ఆశతో కొనుగోలు చేసిన ప్లాట్లు.. ఏళ్లు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇప్పుడు స్థానికులకు భయాన్ని పంచుతున్నాయి. కట్టంగూర్ మండల కేంద్రంలోని పలు వార్డుల్లో ఇళ్ల మధ్య ఖాళీగా ఉన్న స్థలాలు ముళ్లపొదలు, కంప చెట్లతో నిండిపోవడంతో విషసర్పాలు, దోమలకు నిలయాలుగా మారాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇళ్లకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు పిచ్చి మొక్కలు, ముళ్లపొదలు విపరీతంగా పెరిగాయి. పగలు కూడా దట్టంగా ఉండే ఈ ప్రాంతాల్లో పాములు, ఇతర విషపురుగులు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. పిల్లలు, వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. చిన్నారులు ఆడుకునే సమయంలో పొరపాటున ఈ పొదల్లోకి వెళ్తే ఏం జరుగుతుందోనన్న భయం తల్లిదండ్రులను వెంటాడుతోంది.
దోమలు, విషసర్పాలకు ఆవాసాలు..
ఖాళీ స్థలాల్లో చెట్లు, పొదలు పెరగడంతోపాటు వర్షపు నీరు నిలిచే ప్రాంతాలు ఏర్పడుతున్నాయి. దీంతో దోమల బెడద కూడా పెరుగుతోంది. సాయంత్రం అయ్యిందంటే చాలు దోమల మోతతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని ప్రజలు చెబుతున్నారు. ఒకవైపు విషసర్పాల భయం.. మరోవైపు దోమల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్లాట్లు కొన్నారు.. శుభ్రం చేయడం మరిచారు..
భవిష్యత్తులో ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో పలువురు ఖాళీ స్థలాలను కొనుగోలు చేసి ఏళ్ల తరబడి అలాగే వదిలేస్తున్నారు. స్థలం చుట్టూ కనీసం శుభ్రత పాటించకపోవడంతో కంప చెట్లు, ముళ్లపొదలు పెరిగి చుట్టుపక్కల వారికి సమస్యగా మారుతున్నాయి. తమ స్థలాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత యజమానులపై ఉంది. తక్షణమే పంచాయతీ అధికారులు, పాలకవర్గం సభ్యులు స్పందించి గ్రామంలో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి వాటి యజమానులకు నోటీసులు జారీ చేసి ముళ్లపొదలు, కంప చెట్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దోమల నివారణకు పారిశుద్ధ్య చర్యలు చేపట్టడంతో పాటు వాటి నివారణకు ఫాగింగ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ముళ్లపొదలను తొలగించాలి : సిరిశాల శంకర్ స్థానికుడు
ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో పెరిగిన ముళ్లపాదలు, కంపచెట్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పెరిగిన చెత్తాచెదారాన్ని తొలగించకపోవడంతో పాములు, దోమలు, ఇతర విషసర్పాలు ఇండ్లల్లోకి వస్తున్నాయి. దోమలు వృద్ధి చెంది విపరీతంగా కుడుతుండడంతో ఆనారోగ్య పాలవుతున్నాం. ఖాళీ ప్లాట్ల యజమానులకు పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసి శుభ్రం చేసేవిధంగా చర్యలు తీసుకోవాలి.


