భారత్‌లో 15 విదేశీ వర్సిటీలకు గ్రీన్ సిగ్నల్

యూజీసీ నుంచి 16 లెటర్స్ ఆఫ్ ఇంటెంట్.. భారత డిగ్రీలతో సమాన గుర్తింపు


భారత్‌లో ఉన్నత విద్యా రంగానికి కొత్త ఊపు తీసుకొచ్చే నిర్ణయం అమల్లోకి వచ్చింది. దేశంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు 15 విదేశీ విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా వెల్లడించారు.

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇప్పటివరకు ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, ఇటలీకి చెందిన 15 విదేశీ విద్యాసంస్థలకు మొత్తం 16 లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. ఈ విశ్వవిద్యాలయాలు బెంగళూరు, చెన్నై, ముంబై, గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా వంటి ప్రధాన నగరాల్లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నాయి. యూజీసీ విదేశీ ఉన్నత విద్యా సంస్థల నియంత్రణ నిబంధనలు–2023 ప్రకారం ఈ క్యాంపస్‌లు కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

ఈ విద్యాసంస్థల్లో బిజినెస్, ఫైనాన్స్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బయోమెడికల్ సైన్సెస్ వంటి ఆధునిక కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి 500 స్థానాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలకే భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉంటుందని యూజీసీ స్పష్టం చేసింది.

విదేశీ క్యాంపస్‌లు ప్రదానం చేసే డిగ్రీలకు భారతీయ విశ్వవిద్యాలయాల డిగ్రీలతో సమాన గుర్తింపు లభిస్తుంది. ఇందుకోసం విద్యార్థులు ప్రత్యేక ఈక్వివలెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విదేశీ విద్యాసంస్థలకు అవసరమైన సహకారం అందించడం, వాటి కార్యకలాపాలను పర్యవేక్షించడం కోసం ఇప్పటికే ప్రత్యేక ఫెసిలిటేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ నిర్ణయం భారత విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను దేశంలోనే అందుబాటులోకి తీసుకురావడంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

You may also like...